వైఎస్ జగన్ నవ్వులపై జనసేనాని పవన్ కళ్యాణ్ సెటైర్లు.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సెటైర్లేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇప్పటం బాధితులకి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసిన జనసేన అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవ్వుల గురించి పంచ్ డైలాగులు పేల్చారు. ‘సమయం సందర్భం లేకుండా నవ్వుతాడాయన.. ఎవరైనా ఏడుస్తోంటే ఆయన నవ్వుతారు.. ఎవరైనా చచ్చిపోతే ఆయన నవ్వుతారు.. గడపలు కూల్చేస్తే ఆయన నవ్వుతారు..’ అంటూ జనసేనాని ఎద్దేవా చేశారు.

వైఎస్ జగన్ నిజంగానే నవ్వుతారా.?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హావభావాలపై తరచూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతుంటుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు సైతం వైఎస్ జగన్ హావభావాలపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున సెటైర్లు పడ్డాయ్. తరచూ వైఎస్ జగన్ మీద ఈ విషయమై ట్రోలింగ్ జరుగుతూనే వుంటుంది. ‘నవ్వు నాలుగు విధాల చేటు’ అనే సామెతని ఎవరైనా ఆయనకు చెప్పండి.. అంటూ జనసేనాని వ్యాఖ్యానించారు. ‘ఎవరైనా చెప్పండయ్యా.. అది తప్పని..’ అంటూ జనసేనాని ఎద్దేవా చేశారు.

ఏదిఏమైనా, ముఖ కవళికల విషయమై ఇలా జనసేనాని సెటైర్లు వేయడం సబబు కాదేమో.! అన్నట్టు, తమది రౌడీ సేన కాదనీ, విప్లవ సేన అనీ జనసేనాని వ్యాఖ్యానించారు. జనసేనను రౌడీ సేనగా ఇటీవల వైఎస్ జగన్ విమర్శించిన సంగతి తెలిసిందే. ‘మీది రాజకీయ పార్టీనా.? లేదంటే, టెర్రరిస్ట్ ఆర్గనైజేషనా’ అని వైసీపీ మీద మండిపడ్డారు జనసేనాని.