ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు అంశం, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పలు అంశాలను సీఎం జగన్ అమిత్ షా దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
అలాగే పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకరించాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని సీఎం జగన్ కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. వీటితో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపైనా కేంద్ర మంత్రులతో సీఎం వైఎస్ జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో విగ్రహాల ధ్వంసానికి సంబంధించి సీఐడీ రిపోర్టును కేంద్రానికి సీఎం జగన్ అందజేయనున్నట్లు సమాచారం.
ఇక అంతర్వేది రథం దగ్ధం అంశంపై ఇప్పటికే సీబీఐ విచారణ కోరిన నేపథ్యంలో.. దీన్ని వెంటనే నియమించాలని సీఎం జగన్ కోరనున్నట్లు తెలుస్తోంది. ఇక విగ్రహాల ధ్వంసానికి సంబంధించి ఆ కుట్రను సీఎం జగన్ మంత్రులకి వివరించనున్నారు. దీనితో జగన్ ఢిల్లీ పర్యటన పై అందరిలో ఆసక్తి మొదలైంది. కాగా జగన్ పర్యటనపై ప్రతిపక్ష టీడీపీ పలు ఆరోపణలు గుప్పిస్తుంది.