మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఆయుధాలు వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపడానికి సంసిద్ధం చేసింది. పార్టీ ప్రతినిధి అభయ్ పేరుతో పత్రిక ప్రకటన విడుదలైంది. శాంతి చర్చల కోసం నెల సమయం కోరారు. ఈ నెలలో కాల్పులు విరమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వీడియో కాల్ ద్వారా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తమతో సంప్రదించడానికి ఈమెయిల్ ఐడీని కూడా ఇచ్చారు.
తమ ప్రకటనపై టీవీ లేదా రేడియో ద్వారా నిర్ణయం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ ప్రకటన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదలైంది. తాజాగా వెలుగులోకి వచ్చింది. నక్సలైట్ల తరపున సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా వదిలివేస్తామని అభయ్ వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నెల నుంచి మావోయిస్టు పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపడానికి నిజాయితీగా ప్రయత్నిస్తోందని చెప్పారు. .
ఆధునిక ప్రపంచీకరణ పరిస్థితుల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీనియర్ పోలీసు అధికారుల ద్వారా జనజీవన స్రవంతిలో చేరాలని చేసిన అభ్యర్థన దృష్ట్యా తాత్కాలికంగా ఆయుధాలను వదిలివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పార్టీలు, పోరాట సంస్థలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. మావోయిస్టుల ప్రకటనపై ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం స్పందించింది. దేశంలో, రాష్ట్రంలో శాంతితో పాటు అభివృద్ది చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంది. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేందుకు భద్రతా సంస్థల నుంచి నివేదిక కోరాతమని తెలిపింది.
కాగా దేశంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌తో నక్సలైట్లపై ఉక్కుపాదం మోపుతోంది. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలైట్లు లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే హెచ్చరిన విషయం విధితమే. ఈ క్రమంలో భద్రతా బలగాలు చేపట్టిన కాల్పుల్లో అనేక మంది మావోయిస్ట్ పార్టీ కీలక నాయకులు ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరి నక్సలైట్లు నిజంగానే శాంతి చర్చలకు సుముఖంగా ఉన్నారా లేదా తమ వ్యూహంలో భాగంగా ఆయుధాలు వదిలివేస్తామన్న ప్రకటన చేశారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
