“అడిగేవాడు లేకపోతే అంతరిక్షం మా అమ్మమ్మగారిల్లని చెప్పాడంట వెనకటికొకడు” అని కొత్త సామెత! దానికి తగ్గట్లుగానే బీజేపీ నేతల కబుర్లు ఒక్కోసారి కోటల్లు దాటడం సంగతి దేవుడెరుగు… రికార్డుల్లో ఉన్న వాస్తవాలను కూడా ఏమార్చేలా ఉంటున్నాయి. ఈ క్రమంలో… బిజెపి పాలనలో అల్లర్లు జరగవని, మతకలహాలుండవని అమిత్ షా చెప్పిన ఒక స్టేట్ మెంట్ పై లెక్కలు తీసి మరీ షాకిచ్చారు రాజ్యసభ ఎంపి కపిల్ సిబల్!
బీహార్ లోని నవాడా జిల్లా పరిధిలోని హిసువాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన అమిత్ షా… “2024 ఎన్నికల్లో బీహార్ లోని మొత్త 40 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకురండి.. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మెజార్టీ ఇవ్వండి.. ఫలితంగా మేము అధికారంలోకి వచ్చాక అల్లరి మూకలను తలకిందులుగా వేలాడదీస్తాం.. మా పాలనలో మతకలహాలు జరగవు” అని చెప్పుకొచ్చారు.
దీంతో ఫైరయిన కపిల్ సిబాల్… తన ఫైర్ కు తోడు ప్రూఫ్ లు కూడా చూపిస్తూ అమిత్ షాను కడిగేశారు. “బీజేపీ పాలనలో మతకలహాలు జరగవు అని అమిత్ షా చెప్పడం మరో జుమ్లా” అని వ్యంగ్యంగా మొదలుపెట్టిన సిబాల్… బీజేపీ పాలనలో జరిగిన మతకలహాల గణాంకాలను వెల్లడించారు. “నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2014-2020 మధ్య ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యాణా రాష్ట్రాల్లో 5415 మతకలహాలు నమోదయ్యాయి. ఒక్క 2019లోనే – 25 మతకలహాలు జరిగాయి” అంటే… బీజేపీ పాలనలోనే అత్యధిక మతకలహాలు జరిగాయని అర్థం అంటూ కపిల్ సిబాల్ షాకి పంచ్ వేశారు!
కాగా… నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డాటా ప్రకారం.. దేశంలో 2021లో 31,667 అత్యాచారాలు జరిగాయి. అంటే సగటున రోజుకు 86 అత్యాచారాలు ఈ కేంద్ర ప్రభుత్వ పాలనలో జరిగాయి. తాజాగా విడుదలైన ఈ నివేదిక ప్రకారం గతంతో పోలిస్తే అత్యాచారాలు పెరిగాయి. 2020లో 28,046 అత్యాచార ఘటనలు జరగగా… 2021కి వాటి సంఖ్య 31,667 గా పెరిగిందన్నమాట.
ఈ లెక్కల్లో అత్యధికంగా రాజస్థాన్ లో 6,337.. మధ్యప్రదేశ్ లో 2,947.. మహారాష్ట్రలో 2,496.. ఉత్తర్ ప్రదేశ్ లో 2,845.. ఢిల్లీలో 1,250 అత్యాచార ఘటనలు జరిగాయి!