రాష్ట్ర ఎన్నికల సంఘంతో వైఎస్ జగన్ సర్కార్ తలపడటం ఇది రెండవ సారి. గత ఏడాది మొదట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ కరోనా కారణం చూపుతూ ఎంపిటీసీ, జడ్‌పిటీసీ ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేశారు. ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం లేకుండా ఏకపక్షంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేయడం సీఎం వైఎస్ జగన్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ నిమ్మగడ్డపై జగన్ నిప్పులు చెరిగారు.
సామాజిక ప్రస్థావన కూడా తీసుకువచ్చి చంద్రబాబు చెప్పినట్లు ఆడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ ఆగిపోయిన ఎన్నికలను వెంటనే జరిపించాలని కోరుతూ తొలుత హైకోర్టుకు, ఆ తరువాత సుప్రీం కోర్టుకు వెళ్లినా ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ కోపంతో నిమ్మగడ్డను ఇంటికి పంపడానికి స్కెచ్ సిద్ధం చేసిన జగన్ నేరుగా పంపించడం సాధ్యపడని భావించి పదవీ విరమణ అయిన న్యాయకోవిదుల సలహాలతో నిమ్మగడ్డ పదవీ కాలాన్ని కుదించి ఆయన స్థానంలో రిటైర్డ్ న్యాయమూర్తి కనగరాజ్ ను ఎస్ఈసీగా నియమించారు.
ఆ తరువాత పదవి పోగొట్టుకున్న నిమ్మగడ్డ హైకోర్టు, సుప్రీం కోర్టు వరకూ వెళ్లి మరీ ఫైట్ చేసి తన కుర్చీ మళ్లీ సాధించుకున్నారు. అప్పటి నుండి వైసీపీ ప్రభుత్వానికి, ఎస్ఈసీ నిమ్మగడ్డకు వైరం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కూడా ప్రభుత్వ సమ్మతి లేకుండా ఎస్ఈసీ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంతో జగన్ సర్కార్ మరో సారి ఎస్ఈసీపై డైరెక్ట్ ఫైట్ కు దిగింది. ఇప్పుడు కూడా సర్కార్ కు ఊహించని దెబ్బే ఎదురైంది. ఎన్నికల్లో గెలుస్తారా ఓడతారా అనేది పక్కన బెడితే జగన్మోహనరెడ్డి సర్కార్ ఎస్ఈసీ నిమ్మగడ్డతో జరిగిన పోరులో రెండవ సారి ఓడిపోయారు. గవర్నర్ ద్వాారా నిమ్మగడ్డ కు చెక్ చెప్పడానికి ఎమైనా అవకాశాలు ఉన్నాయేమో? అయితే ఇప్పటికే ఒక ప్లాన్ ప్రకారం కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తున్నందున కరోనా వ్యాక్సినేషన్ సంగతి ఏమి చేయమంటారో సమాధానం చెప్పాలని కోరింది. దీనిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి