జగన్ కు ఎమ్మెల్సీ ఫలితాలు నేర్పిన పాఠాలివే!

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ముగిసింది. అంతా భావించినట్లుగానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ క్లీన్ స్వీప్ చేసుకుంది. గతేడాది జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇచ్చిన భారీ విజయం దానికి కారణం. ఇక టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికారపార్టీకి విజయం దక్కింది. ఆ సంగతి అటుంచితే… ఇప్పుడు సమస్య అంతా గ్యాడ్యుయేట్స్ ఎమెల్సీ ఎలక్షన్ లోనే!

అవును… నిరుద్యోగ సమస్యలు, ఉపాది లేని పరిస్థితులు.. సీఎం పూర్తిగా సంక్షేమంపైనే శ్రద్ధ పెడుతున్నారనే విమర్శలు వెరిసి… గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ కి షాక్ తగిలింది. యువతలో, మరి ముఖ్యంగా నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న విషయం మాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో జగన్ రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫలితం ఎలా ఉన్నా… ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఏ రౌండ్ లోనూ వెనకబడలేదు. గత ఎన్నికల్లో విజయనగరంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా.. శ్రీకాకుళం జిల్లాలో రెండు, విశాఖ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకే టీడీపీని జగన్ పరిమితం చేయగలిగారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకొచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్న్నికల్లో యువత వ్యతిరేకతతో ఉందని అర్థమవుతుంది. నాలుగేళ్లుగా సంక్షేమాన్ని పట్టుకునే ఊగులాడటం, అభివృద్ధిని విస్మరించడం కూడా జగన్ పై వ్యతిరేకత పెరగడానికి కారణమనే కామెంట్లకు ఇవి బలం చేకూరుస్తున్న పరిస్థితి.

ఇక టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికొచ్చేసరికి జగన్ కి ఊరట లభించిందనే చెప్పాలి. ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింటినీ వైసీపీ గెలుచుకుంది. అంటే… టీచర్లంతా జగన్ కే జై కొట్టినట్లు భావించవచ్చు. అయితే… నిన్నమొన్నటివరకూ… సీపీఎస్ రద్దుకోసం రాష్ట్రం అట్టుడికిపోయేలా ఆందోళనలు చేయడం, పీఆర్సీ పిసరంతే అంటూ నొచ్చుకోవడం తెలిల్సిందే. ఇదే క్రమంలో జీతాలు సమయానికి రావడం లేదని, బకాయిలు విడుదల కావడంలేదనీ గొడవ గొడవ చేశారు. కానీ.. బాబుతో పోలిస్తే జగన్ బెటర్ అనుకున్నారో ఏమో కానీ… చివరికి జగన్ కే జై కొట్టారు. ఇది జగన్ సర్కార్ కి కాస్త ఉపశమనం కలిగించే విషయం!

ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇచ్చిన అనుభవం, నేర్పిన పాఠాలతో జగన్… ముఖ్యంగా అభివృద్ధి, నిరుద్యోగ సమస్యల పరిష్కారాల దిశగా ఆలోచిస్తే మంచిది. అలా కానిపక్షంలో సంక్షేమంలో ఫుల్ మార్కులున్నా.. రాబోయే ఎన్నికల్లో యువత పంటికింద రాయిలా మారే ప్రమాదం లేకపోలేదు!