రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న జగన్ సర్కార్ వారికి మరో కానుక అందించింది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం రూ.1,766 కోట్లను జమచేసింది. వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ పథకం మూడోవిడత నిధులు, అక్టోబరులో వచ్చిన నివర్ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ కింద ఇస్తామన్న నిధుల్ని ప్రభుత్వం జమచేసింది.
వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ మూడోవిడత కింద రూ.1,120 కోట్లు, నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.646 కోట్లను చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. కంప్యూటర్‌లో మీట నొక్కి చెల్లింపుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో శుభకార్యానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. రైతుల ఖాతాల్లో రూ.1,766 కోట్లు జమ చేస్తున్నాం. మూడో విడత రైతు భరోసాగా రూ.1,120 కోట్లు, నివర్ తుపాను పరిహారం కింద రూ.646 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేస్తున్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతులకు మంచి ధరలు రావాలనేదే మా లక్ష్యం. గత ప్రభుత్వం రూ.87,612 కోట్లు రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను నిలువునా ముంచింది. కేవలం రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆర్బీఐ చెప్పింది. ధాన్యం, విత్తనం, ఇన్సూరెన్స్, విద్యుత్ బకాయిలు, సున్నా వడ్డీ రుణాలు ఎగ్గొట్టారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా చెల్లించాం.