వారిద్దరూ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు. వేర్వేరు రాష్ట్రాల్లో ఒకే తరహా శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరూ ముఖ్యమంత్రుల కుమారులే. ఉద్యమాలే పునాదిగా ఒకరు రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించి తిరుగులేని నేతగా ఎదిగితే..ఇంకొకరు ఎమ్మెల్సీగా ఎంట్రీ ఇచ్చారు. వారే తెలంగాణ, ఏపీ ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్, నారా లోకేష్. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఏర్పాటైన ప్రపంచ ఆర్థిక సదస్సుకు వారిద్దరూ హాజరయ్యారు.
దావోస్‌లో కేటీఆర్, నారా లోకేష్ ఇప్పటిదాకా ముఖాముఖిగా కలుసుకోలేదు. ఎవరి శైలిలో వారు విదేశీ ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి తమవంతు కృషి చేస్తున్నారు. ఏటా దావోస్‌లో జరిగే ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లడం ఆనవాయితీ. క్రమం తప్పకుండా హాజరవుతారు. ఈ సారి మాత్రం తన కుమారుడు, ఐటీ మంత్రి లోకేష్‌కు ఆ ఛాన్స్ ఇచ్చారు.