ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో ముందస్తు పంచాయతీ కనుమరుగయ్యి… పొత్తుల రాజకీయం తెరపైకి వచ్చింది. అయితే నిన్నమొన్నటివరకూ పొత్తుల విషయంలో టీడీపీని లైట్ తీసుకున్నట్లు మాట్లాడిన బీజేపీ నేతల మాటలు తడబడుతున్నాయి. ఇక తనకు పొత్తు లేకపోతే వీరమరణమే అని పవన్ ఏనాడో కన్ ఫాం చేసేశారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ నేతల వైఖరి మారింది. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయంటూ వస్తున్న కథనాలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కలిసొచ్చే ఏ చిన్న విషయాన్ని వారు లైట్ తీసుకోవాలని అనుకోవడం లేదు. అందులో భాగంగా ఏపీలో టీడీపీతో పొత్తులపై అనుకూలంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది.
దీంతో… నిన్నమొన్నటివరకూ టీడీపీని, చంద్రబాబునీ తీవ్రంగా చీత్కరించుకున్న కొంతమంది ఏపీ బీజేపీ నేతలు సైతం మాటలు మారుస్తున్నారు. తమ టార్గెట్ వైసీపీ అని చెబుతున్నారు. పొత్తుల నిర్ణయం జాతీయస్థాయి విషయం అని సైడ్ చేస్తున్నారు. దీంతో… పొత్తులపై స్పందించొద్దని ఏపీ బీజేపీ నేతలకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయనే చర్చ తెరపైకి వచ్చింది.
అయితే ఏపీలో బీజేపీతో టీడీపీతో పొత్తు ఎవరికి ఉపయోగం, మరెవరికి నష్టం అనే అంశం ఇప్పుడు కీలకంగా మారింది. ఒకసారి 2014 ఎన్నికల సమయానికి వెళ్దాం. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఆ ఎన్నికల్లో చంద్రబాబు సీనియారిటీకి, మోడీ చెప్పిన మాటలకీ ఏపీ ప్రజలు విలువిచ్చారు. ఫలితంగా ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది.
ఆ ఎన్నికల్లో టీడీపీ + బీజేపీకి 106 సీట్లు రాగా వైసీపీకి 67 సీట్లు దక్కాయి. అయితే ఆ ఎన్నికల్లో జనసేన బయట నుంచి మద్దతు ఇచ్చిందే తప్ప పోటీకి దిగలేదు. కానీ ఈ సారి అవే పొత్తులు రిపీట్ అయితే జనసేన పోటీ చేయనుంది. అంటే… టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య 175 సీట్లను షేరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పొత్తుల ప్రస్థావన లేకుండానే 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ పోటీచేసింది. 2024లో కూడా సింగిల్ గానే రంగంలోకి దిగబోతుంది.
అయితే ఇలా 2014 తరహాలో పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన్న ఫలితాలు అలానే వస్తాయని అనుకుంటే అంతకు మించిన అవగాహనాలోపం లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే… 2014లో రాష్ట్రం విడిపోయిన సమయంలో చంద్రబాబు సీనియర్ గనుక ఈ సమయంలో ఆయన సీఎం అయితేనే రాష్ట్రం గాడిన పడుతుందనే ప్రచారం బలంగా జనాల్లోకి వచ్చింది. ఇక మోడీ సైతం… నేనున్నాను అని భరోసా ఇచ్చే సరికి ఇంకేముంది అనుకున్నారు ఏపీ ప్రజానికం!
అయితే నాడు ఏపీ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని అటు చంద్రబాబు, ఇటు నరేంద్ర మోడీ ఇద్దరూ పూర్తిగా వమ్ముచేసుకున్నారు. ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకుంటూ రాష్ట్రానికి చేయాల్సిన అన్యాయం మొత్తం చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాటు అమరావతి గ్రాఫిక్స్ పైనే దృష్టి పెట్టారు. దీనికి తోడు విభజన హామీలను కేంద్రంలోని బీజేపీ గాలికొదిలేసింది. ఆ సమయంలో వారిని గట్టిగా అడిగి తెచ్చుకోవడంలో చంద్రబాబు సీనియారిటీ పూర్తిగా ఫెయిలయ్యింది.
ఆ సమయంలో ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారనే విషయం 2019 ఎన్నికల ఫలితాలు చూసిన ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది. ఏపీ జనాలపై టీడీపీ – బీజేపీ కూటమిపై అలాంటి అభిప్రాయం ఉన్న వేళ… ఇప్పుడు జగన్ ఏదో అవినీతి చేస్తున్నాడని, అక్రమాలు చేస్తున్నాడనే ఆరోపణలను చూపిస్తూ… తమకు అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు.
కానీ… ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, రైల్వే జోన్, విభజన హామీలు… తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్…. ఇలా మూటగట్టుకోవాల్సిన పాపమంతా మూటగట్టేసుకున్న బీజేపీతో బాబు కలిసి వెళ్లినంత మాత్రాన్న 2014 ఫలితాలు వచ్చేస్తాయా? ఇంకా గట్టిగా మాట్లాడితే ఏపీ ప్రజలకు బీజేపీ పై ఉన్న ఆగ్రహానికి ఏపీలో 2019 ఫలితాలు రిపీట్ అయినా ఆశ్చర్యం లేదని అనుకోవచ్చు.
మరి బీజేపీతో వెళ్తే ఇంత రిస్క్ అని టీడీపీలో కొంతమంది నేతలు చెబుతున్నా కూడా చంద్రబాబుకు ఉన్న భయం ఆ మాటలు వినకుండా చేస్తుందని అంటున్నారు కొంతమంది తమ్ముళ్లు. కారణం.. ముందు ముందు ఏపీలో జగన్ ని ఎదుర్కోవాలంటే జాతీయ స్థాయిలో ఒక బలమైన పార్టీ అండ ఉండాలని నమ్ముతున్నారు. పైగా… తాను బీజేపీతో కలవని పక్షంలో బీజేపీతో జగన్ లోపాయకారీ ఒప్పందం వంటిది చేసుకుంటే… తన పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోద్దని ఆందోళన చెందుతున్నారు.
మరి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు… కష్టమో సుఖమో 2014 పొత్తులనే ఫైనల్ చేస్తారా.. లేక, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే ఛాన్స్ బీజేపీకి ఇస్తారా అనేది వేచి చూడాలి!