గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ఆ డెయిరీ చైర్మన్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టవటం, ఇటీవలనే షరతులపై హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయనపై మరో కేసు నమోదు కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో ఉన్న కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఆయనపై కేసు నమోదు చేశారు విజయవాడ పోలీసులు.
డైరీ కేసులో నెల రోజుల పాటు విజయవాడలోనే వుండాలని… సిటీ విడిచి ఎక్కడికీ వెళ్లకూడదని నరేంద్రకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయటం జరిగింది. తాజాగా సంగం డెయిరీ పాలకవర్గంతో విజయవాడలో ఒక ప్రముఖ హోటల్‌లో సమావేశం నిర్వహించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ 20 మందితో ఆ మీటింగ్ జరిపారని ధూళిపాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 12 మందితోనే సమావేశం పెట్టుకున్నట్లు డైరీ యాజమాన్యం అంటోంది. ఈ కేసులో సంగం డైరీ కంపెనీ సెక్రటరీ సందీప్‌ను విచారిస్తున్నారు పోలీసులు. డైరీని ప్రభుత్వ పరం చేయాలనుకుంటూ జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఏపీ హైకోర్టు రద్దు చేయటం తెలిసిందే. ఇదంతా వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు అని, సంగం డైరీని అడ్డం పెట్టుకుని నరేంద్ర మీద కేసులు పెడుతున్నారంటూ టీడీపీ ఆరోపణలు చేస్తుంది.