అనిల్ కి లోకేష్ థాంక్స్ చెప్పాల్సిందే!

జనవరి 27వ తేదీన 400 రోజులు 4000 కిలోమీటర్ల లక్ష్యంగా ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర ఆశించిన స్థాయిలో ప్రజాధరణ చూరగొనడం లేదనే చర్చ టీడీపీ వర్గాల్లో కూడా నడుస్తుంది. అయినా కూడా మాటల్లో ఎంతోకొంత మార్పు కనిపించిందని, పదప్రయోగాల విషయంలో మెరుగు కనిపించిందని అంటున్నారు. ఈ సమయంలో ఒక కొత్త చర్చ తెరపైకి వచ్చింది.

ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడి పాదయాత్రకు మీడియా ఇచ్చిన కవరేజ్ లో 10% కూడా లోకేష్ పాదయాత్రకు ఇవ్వడం లేదనే చర్చ ఏపీలో బలంగా వినిపిస్తుంది. కనీసం టీడీపీ అనుకూల ఛానళ్లలో సైతం ఆ కవరేజ్ మిస్సవ్వడమే కాకుండా… ఆ యాత్రపై డిబేట్ లు డిస్కషన్స్ సైతం ఎక్కడా కనిపించడం లేదు. దీంతో… లోకేష్ పాదయాత్రను టీడీపీ అనుకూల మీడియా సైతం ఎందుకు లైట్ తీసుకుంది అనే చర్చ మొదలైపోయింది.

ఆ సంగతి అలా ఉంటే నిన్న మొన్నటి వరకూ ఎంతో కొంత జిల్లా ఎడిషన్స్ కి అయినా నోచుకున్న నారా లోకేష్ పాదయాత్ర… పవన్ వారాహి యాత్ర అనంతరం జిల్లా ఎడిషన్స్ లో సైతం సెకండ్ ప్రియారిటీ.. కాదు కాదు థర్డ్, ఫోర్త్ ప్రియారిటీగా మారిపోయిందని అంటున్నారు. కేవలం ఏయే నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారో కేవలం ఆ నియోజకవర్గాల్లో మాత్రమే కవరయ్యేలా ప్రచురితానికి నోచుకుంటున్నారనే విమర్శ కూడా వస్తొంది.

ఈ సమయంలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ కు లోకేష్ & కో థాంక్స్ చెప్పుకోవాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గత రెండు మూడురోజులుగా నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న లోకేష్ ను అనీల్ చెడుగుడు ఆడేస్తున్నారు. ఛాలెంజ్ లు చేస్తున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఫలితంగా సోషల్ మీడియాలో అనీల్ కామెంట్ల ఫలితంగా లోకేష్ ప్రస్థావన సైతం తెరపైకి వస్తోంది.

ఇదే సమయంలో లోకేష్ పై అనీల్ విమర్శలు వైసీపీ అనుకూల మీడియా కవర్ చేస్తుండటంతో… ఆ విమర్శలకు లోకేష్ ఇచ్చిన కౌంటర్స్ ని టీడీపీ అనుకూల మీడియా కవర్ చేయాల్సి వస్తోంది. లేదంటే… ఈ వారాహి యాత్ర మాటున లోకేష్ పాదయాత్ర మరింతగా కవరేజ్ కి దూరమై కనుమరుగైపోయేదని అంటున్నారు. ఫలితంగా… లోకేష్ కు మరికొంత ప్రియారిటీ వస్తోందని అంటున్నారు. సో… లోకేష్ కు అనిల్ ఇస్తున్న పబ్లిసిటీ, పాదయాత్రకు ఇస్తున్న పబ్లిసిటీకి థాంక్స్ చెప్పుకోవాలని సూచిస్తున్నారు నెటిజన్లు.