ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరు సీఎంలలా కాకుండా కొత్త పంథాతో దూసుకెళ్తున్నారు. ఏపీని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లడానికి కొత్త కొత్త ఆలోచనలకు రూపం ఇస్తున్నారు. అంతే కాదు.. తన పరిపాలనలో పారదర్శకతకూ అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఎక్కడైనా అవినీతి అనేది రాజమేలుతుంది అనేది బహిరంగ రహస్యం. ఏ శాఖలో చూసినా అవినీతే. దీని వల్ల రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుంది. అందుకేనేమో… వైఎస్ జగన్ తన పాదాన్ని అవినీతి మీద మోపారు. అవినీతిని సహించేది లేదంటూ కుండబద్దలు కొడుతున్నారు.
అవినీతిని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసేందుకు కొన్ని సంచలన నిర్ణయాలను సీఎం జగన్ తీసుకున్నారు. అవినీతి నిర్మూలన కోసం ఏం చేస్తే బాగుంటుందో సీఎం జగన్ సమీక్ష నిర్వహించి ఓ నిర్ణయానికి వచ్చారు.
గత కొన్ని రోజుల నుంచి ఏపీలో లంచం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లంచం తీసుకుంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికితే వెంటనే వాళ్లపై చర్యలు తీసుకునేలా ఓ చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. దిశ చట్టం లాగానే లంచంపై ఓ చట్టాన్ని తీసుకొచ్చి.. ఆ చట్టం ప్రకారం లంచం తీసుకున్నవాళ్లకు శిక్ష విధించేలా ఆలోచిస్తున్నారు సీఎం.
దాని కోసం ఇప్పుడు ఉన్న 1902 నెంబర్ తో పాటుగా… 14400 నెంబర్ ను కూడా ఏసీబీ డిపార్ట్ మెంట్ కు అనుసంధానం చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ నెంబర్ ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టి.. గ్రామ, వార్డు సచివాలయాలను అనుసంధానం చేసి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
దానితో పాటుగా… ప్రభుత్వంలో ఉన్న ప్రతి విభాగాన్ని రివర్స్ టెండరింగ్ చేయాలంటూ పిలుపునిచ్చారు. మరోవైపు ఒక్క టెండర్ విలువ కోటి రూపాయలు దాటిందంటే చాలు.. వెంటనే రివర్స్ టెండరింగ్ కు వెళ్లాల్సిందేనంటూ సీఎం స్పష్టం చేశారు.
లంచం తీసుకునే వాళ్లకు శిక్ష విధించే చట్టంతో పాటుగా… ప్రభుత్వ శాఖల్లో సరిగే అవినీతిపై కూడా ఓ చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో అవినీతిని మటుమాయం చేయడమే ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారు.
ఇలాంటి చర్యలను గత ముఖ్యమంత్రి ఎవ్వరూ తీసుకోలేదు. ఇలాంటి ముందడుగు ఏ ముఖ్యమంత్రీ వేయలేదు. ఇటువంటి పనులు చేస్తే ఖచ్చితంగా మరోసారి కూడా జగన్ నే గెలిపిస్తాం.. అంటూ ప్రజలు జైకొడుతున్నట్టుగా తెలుస్తోంది.