ఏపీలో ఉత్కంఠరేపిన తాడిపత్రి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక టెన్షన్‌కు తెరపడింది. టీడీపీ పాలకవర్గం కొలువుదీరింది.. ముందు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయగా.. ఆ తర్వాత ఛైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించారు. అందులో ఛైర్ పర్సన్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి గెలిచిన 18 మందితోపాటు సీపీఐ, స్వతంత్రుల మద్దతుతో గెలుపు సాధ్యమైంది.
తాడిపత్రిలో మొత్తం 36 వార్డులుండగా టీడీపీ 18చోట్ల.. వైఎస్సార్‌సీపీ 16 చోట్ల విజయం సాధించాయి. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి చెరొక చోట గెలిచారు. ఇక్కడ స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అనంతపురం ఎంపీ తలారీ రంగయ్య ఓటుతో కలిపితే వైఎస్సార్‌సీపీ బలం 18కు చేరింది. ఇక టీడీపీకి 18మంది కౌన్సిలర్లు.. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఇవ్వడంతో టీడీపీ బలం 20కు చేరింది. దీంతో ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఎక్స్ అఫిషియో ఓటు కోసం ప్రయత్నించినా హైకోర్టు పిటిషన్ కొట్టేసింది.
తాడిపత్రిలో గత రెండు, మూడు రోజులుగా హై టెన్షన్ వాతారవణం కనిపించింది. మున్సిపాలిటీని ఎవరు కైవసం చేసుకుంటారని ఉత్కంఠరేపింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే టీడీపీ అప్రమత్తం అయ్యింది. 18మంది కౌన్సిలర్లతో పాటూ సీపీఐ, స్వతంత్ర అభ్యర్థుల్ని కూడా క్యాంప్‌కు తరలించింది. అక్కడి నుంచి నేరుగా ఎన్నిక ప్రక్రియకు తీసుకొచ్చి వ్యూహాత్మకంగా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసింది.