Ambati Rambabu Daughter Wedding: మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె ప్రేమ వివాహం అమెరికాలో ఘనంగా జరిగింది

Ambati Rambabu Daughter Wedding: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకులు అంబటి రాంబాబు కుమార్తె డాక్టర్ శ్రీజ ప్రేమ వివాహం అమెరికాలోని ఇల్లినాయిస్‌లో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో ఎండోక్రైనాలజీ విభాగంలో ఫెలోషిప్ చేస్తున్న డాక్టర్ శ్రీజ, డోయిచ్ బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జాస్తి హర్షను పెళ్లాడారు.

ఇల్లినాయిస్‌లోని మహా లక్ష్మీ ఆలయంలో జరిగిన ఈ వివాహ వేడుకకు అంబటి రాంబాబు దంపతులు, బంధువులు హాజరయ్యారు. వరుడు హర్ష పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందినవారు.

కుమార్తె ప్రేమ వివాహంపై అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఈ వివాహాన్ని ఏపీలో చేయాలనుకున్నప్పటికీ, ట్రంప్ ప్రభావంతో అమెరికాలోనే నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. “మా అల్లుడు హర్షను నా కుమార్తె ప్రేమించింది. పెళ్లి ఏపీలో చేయాలనుకున్నాం. కానీ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా వస్తే అమెరికా నుంచి వెళ్లినవారు తిరిగి రాలేరేమోనన్న ఆలోచనతో ఇక్కడే చేయాల్సి వచ్చింది,” అని ఆయన వెల్లడించారు.

వరుడు హర్ష తల్లిదండ్రులు వీసా సమస్యల కారణంగా పెళ్లికి హాజరు కాలేకపోయారని, మూడుసార్లు ప్రయత్నించినా వీసా రాలేదని అంబటి రాంబాబు విచారం వ్యక్తం చేశారు. దీంతో వారు లైవ్‌లో పెళ్లి వేడుకను చూడాల్సి వచ్చిందని తెలిపారు. నవ దంపతులు ఏపీకి వచ్చాక ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని అంబటి ప్రకటించారు.

ప్రస్తుతం వైఎస్సార్‌సీపీలో చురుకుగా ఉంటూ పార్టీ వాయిస్‌ను బలంగా వినిపిస్తున్న అంబటి రాంబాబు, ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించారు. రాజకీయాలతో పాటుగా సినిమా రివ్యూలు ఇస్తూ, తన రోజువారీ పనులపై వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. కుమార్తె వివాహం కోసం అమెరికా వెళ్లినప్పటికీ, అక్కడి విశేషాలను, కుమార్తె, అల్లుడిని పరిచయం చేస్తూ వీడియోలను తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. అంతేకాక, ట్విట్టర్ వేదికగా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

Balakrishna Comments, KS Prasad Revealing Some Facts | Telugu Rajyam