అంబటి, అవంతి.. టార్గెట్ అయ్యారెందుకు.?

కొన్నాళ్ళ క్రితం వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకి సంబంధించినదిగా చెప్పబడుతూ ఓ ఆడియో టేప్ లీక్ అయ్యింది. దానిపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. స్వయంగా అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా ఆ వ్యవహారంపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తన మీద కుట్ర జరుగుతోందనీ, పోలీసులను ఆశ్రయించి బాధ్యుతలపై చర్యలు తీసుకుంటాననీ అంబటి చెప్పుకొచ్చారు. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్‌దిగా చెప్పబడుతున్న ఓ వాయిస్ తాలూకు కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అక్కడా ఇక్కడా.. ఓ మహిళ (యువతి)తో మాట్లాడుతున్న వైనమే కనిపించింది. ఆ మహిళ వేరు, ఈ మహిళ వేరు. అసలు వాళ్ళెవరు.? అన్నదానిపై ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని మహిళల్ని లోబర్చుకుంటున్నారన్నది అధికార పార్టీ నేతలపై ఈ లీకుల ద్వారా వస్తున్న ఆరోపణ. ఇందులో నిజమెంత.? తేలాలంటే విచారణ జరగాలి.

సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, ప్రభుత్వంలో వున్నవారికి వ్యతిరేకంగానో పోస్టులు పెడితే, ఠక్కున అరెస్టులు చేసేసే ఏపీ సీఐడీ, ఇలాంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నది వైసీపీ మద్దతుదారుల వాదన. అదీ నిజమే.. రాజకీయ నాయకుల పరువు బజార్న పడేసే ఇలాంటి విషయాల పట్ల పోలీసు శాఖ కూడా అప్రమత్తంగా వుండాలేమో. అయితే, ఈ కేసుల్లో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించాల్సి వుంటుంది. ఆ తర్వాతే విచారణ షురూ అవుతుంది. అంబటి పోలీసుల్ని ఆశ్రయించారా.? అవంతి సంగతేంటి.? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి వుంది. ఇంతకీ, ఈ ఇద్దర్నీ ఎవరు టార్గెట్ చేసినట్టు.? మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ అంటూ జరిగితే అంబటికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అవంతి తన మంత్రి పదవిని నిలబెట్టుకుంటారుగానీ.. అన్న చిన్న పాజ్ వినిపిస్తోంది. ఈ తరుణంలోనే ఈ లీకులు తెరపైకి రావడం యాదృశ్చికమేనా.? ప్రత్యర్థులు కుట్రలు పన్నుతున్నారా.? ఏమోగానీ, ఈ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు జరిగితేనే నిజానిజాలు బయటపడ్తాయ్.