ఒక్కరు చేస్తే పాదయాత్ర.. మరి, వందల మంది చేస్తేనో.!

ఒక్క రాజధాని అమరావతి సరిపోతుందా.? మూడు రాజధానులు కావాలా.? అన్న విషయమై ఎటూ తేల్చుకోలేకపోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏకైక రాజధాని అమరావతి.. అంటూ గాల్లో మేడలు కట్టేశారు టీడీపీ అధినేత చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాను ముఖ్యమంత్రిగా వున్న ప్రస్తుత సమయంలో మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఏదో ఒకటి, ముందైతే రాష్ట్రానికి సరైన రాజధాని వుండాలి కదా.? ఆ దిశగా రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కార్ సరైన నిర్ణయం తీసుకోలేకపోతోందన్న విమర్శలున్నాయి.

ఇదిలా వుంటే, అమరావతి రైతులు ‘మహాపాదయాత్ర’ పేరుతో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు. పదుల సంఖ్యలో.. కాదు కాదు, వందల సంఖ్యలో రైతులు, వారి మద్దతుదారులు పాదయాత్రలో పాల్గొంటున్నారు.

రోజురోజుకీ ఈ పాదయాత్రకి ప్రజాదరణ పెరుగుతోంది. ప్రస్తుతానికైతే ఇంకా గుంటూరులోనే పాదయాత్ర కొనసాగుతుండడంతో ఈ స్థాయి మద్దతు రావడం సహజమే. కానీ, రాయలసీమలోకి అడుగు పెట్టాక ఈ పాదయాత్ర ఎలా వుండబోతోంది.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

పాదయాత్రపై ప్రజలు రాళ్ళేస్తారంటూ వైసీపీ నేతలు, వైసీపీ మద్దతుదారులు చేస్తున్న వ్యాఖ్యలతో ముందు ముందు ఈ యాత్ర ఎలా సాగుతుందన్నదానిపై ఒకింత ఆందోళన నెలకొంది.

ఒక్కటి మాత్రం నిజం.. రాజధాని అమరావతి విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన రానే వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకుంటే, అది వైసీపీకి అలాగే రాష్ట్రానికీ మంచిదన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది.