రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటినుంచీ కాకెత్తిపోతున్నారు జేఏసీ ప్రతినిధులు! రాజధాని ప్రాంతంలో ధనవంతులు మాత్రమే ఉండాలనే బాబు నియంతృత్వ వాదనతో బలంగా ఏకీభవిస్తున్న జేఏసీ ప్రతినిధులు.. లిమిట్స్ క్రాస్ చేసే కార్యక్రమానికి తెరలేపారు. ఇది ప్రజాస్వామ్యం అన్న ఆలోచన మరిచిపోయారు! దీంతో అల్లర్లతో అడ్డుకోవాలనుకోవడం కరెక్ట్ కాదనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా వినిపిస్తున్నాయి.
రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ళపట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు యుద్ద ప్రాతిపదికన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకాలం కోర్టు పరిధిలో ఉన్న ఈ విషయంపై.. ప్రభుత్వానికి – పేదలకు అనుకూలంగా తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. తుళ్ళూరు మంగళగిరి మండలాల్లో సుమారు 54 వేలమంది పేదలకు ఇళ్ళపట్టాలు ఇవ్వటానికి ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. ఇందుకు గాను సుమారు 1,400 ఎకరాలను కేటాయించిన జగన్ సర్కార్… ఈనెల 18వ తేదీన పట్టాల పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో న్యాయస్థానలు ఇచ్చిన తీర్పులు తమకు వ్యతిరేకంగా వస్తే… వారు ఎలా మారిపోతారో అనే విషయం చెప్పకనే చెప్పే పనికి పూనుకున్నారు జేఏసీ నేతలు.
పేదలకు భూములు పంచే విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యక్షపోరాటాలకు దిగారు అమరావతి జేఏసీ ప్రతినిధులు. దాంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. జేఏసీ వేసిన కేసులను కోర్టులు కొట్టేయటంతో పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ దొరికిన నేపథ్యంలో.. తమకు అనుకూలంగా వస్తేనే అవి న్యాయమైన తీర్పులు.. తమకు వ్యతిరేకంగా వస్తే వాటిని తాము పరిగణలోకి తీసుకోవమనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు ఆ సంస్థ ప్రతినిధులు.
మళ్ళీ పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు ఇప్పటికే సుప్రింకోర్టులో కేసు వేసింది జేఏసీ. అయితే సుప్రీం తీర్పులపై వారికి నమ్మకం లేదో.. లేక, తాము చేస్తున్నది తప్పు కాబట్టి సుప్రీం లో కూడా ఎదురుదెబ్బలు తప్పవని భావించారో కానీ… పట్టాల పంపిణీపై జరుగుతున్న పనులను అడ్డుకునేందుకు ప్రత్యక్ష పోరాటానికి దిగారు. ప్రభుత్వం చదునుచేసిన భూమిని దున్నేస్తున్నారు. సర్వేరాళ్ళని పీకేస్తోన్నారు. దాంతో ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో ఆంక్షళను విధించాల్సి వచ్చింది.
ఆర్-5 జోన్ లో పనులు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతంలోకి రాజధాని రైతులు, ఇతరులు ఎవరు అడుగుపెట్టేందుకు అనుమతి లేదని ఆంక్షలు విధించింది. ముందుజాగ్రత్తగా పెద్దఎత్తున పోలీసులను ఏర్పాటుచేసింది. దీంతో… పేదలకు ప్రభుత్వం సాయం చేయాలంటే పోలీసుల సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏపీలో నెలకొందని విస్మయం వ్యక్తం చేస్తున్నారు ప్రజాస్వామ్య వాదులు.. పేదల పక్షపాతులు!