సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో జన చైతన్య వేదిక ఏర్పాటు చేసిన సదస్సులో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం తీవ్ర ఆరోపణలనే చెశారు. చంద్రబాబానాయుడు, నారా లోకేష్ పేర్లు ఎత్తలేదు కానీ అందరికీ అర్ధమయ్యేరీతిలోనే కల్లం తన ఆరోపణలను గుప్పించారు. గతంలో ఎన్నడూ కల్లం ఈస్ధాయిలో గొంతెత్తలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయిన దగ్గర నుండి కల్లం చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం అందరూ చూస్తున్నదే. ఏదో సందర్భం వచ్చినపుడు కల్లం మాట్లాడుతునే ఉన్నా ఇంత తీవ్ర స్ధాయిలో మాత్రం ఎప్పుడూ నోరిప్పలేదు.
కానీ తిరుపతి సభలో మాత్రం దాదాపు డైరెక్ట్ అటాక్ చేశారనే చెప్పాలి. సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన వేల కోట్లను దోచుకున్నట్లు మండిపడ్డారు. తమ అక్రమ సంపాదనను కర్నాటక, తెలంగాణా ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నట్లు రాజకీయ ఆరోపణలు చేయటం గమనార్హం. ధర్మపోరాటాలు, విదేశీ ప్రయాణాలు, ప్రత్యేక విమానాలు, తాత్కాలిక నిర్మాణాల పేరుతో ప్రజాధన వృధా చేస్తున్నట్లు మండిపడ్డారు. నాలుగేళ్ళల్లో ఓ మీడియా సంస్ధకు చంద్రబాబు రూ 700 కోట్లు దోచిపెట్టారని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది.
అవినీతికి అంతులేదన్నారు. రూ 450 కోట్లు విలువ చేసే భూమిని రూ 45 లక్షలకే దారాదత్తం చేశారంటూ చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. 5 లక్షల మొబైల్ ఫోన్లు కొనుగోలులో రూ 150 కోట్లు దోచుకున్నారట. సెల్ ఫోన్లు కొనుగోళ్ళలో కోట్ల రూపాయలు దోచుకున్నారని కల్లం చెప్పటమంటే ఎవరికి అవకాశం ఉందో అందరికీ తెలిసిందే. వర్షం వస్తే కారే సచివాలయం నిర్మాణానికి చదరపు అడుగుకు రూ 11 వేల ఖర్చు చేశారట. పంటలకు గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరోవైపు విదేశాల నుండి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటు వ్యాపారులకు వందల కోట్లు దోచిపెడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
చంద్రబాబు ప్రభుత్వంపై కల్లం ఇపుడు చేసిన ఆరోపణలేవీ కొత్తవి కావు. ప్రధాన ప్రతిపక్షం వైసిపి ఎప్పటి నుండో చేస్తున్నవే. కాకపోతే వైసిపి చేసిన ఆరోపణలన్నీ రాజకీయ ఆరోపణలుగా మిగిలిపోయాయి. అజయ్ కల్లం ఆరోపణలు చేయటంతో కాస్త విశ్వసనీయత వచ్చింది. అయితే, గడచిన నాలుగేళ్ళుగా చంద్రబాబు ప్రభుత్వం దోచుకుంటోందని ఇపుడు చెబుతున్న కల్లం తాను ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాలంలో ఏమి మాట్లడినట్లు గుర్తులేదు.