సినీ నటుడు పృధ్వి, 2019 ఎన్నికల సమయంలో వైసీపీతో వున్నాడు. వైఎస్ జగన్ వెంట, పాదయాత్రలోనూ కనిపించాడు పృధ్వీ. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా పాపులర్ అయిన పృధ్వీ, అప్పట్లో జనసేన మీదా అలాగే తెలుగుదేశం పార్టీ మీదా నానా రకాల విమర్శలూ చేశారు. రాజకీయాల్లో ఇలాంటోళ్ళని, ఆయా రాజకీయ పార్టీలు అవసరార్థం ఎంటర్టైన్ చేస్తుంటాయ్.
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక, పృధ్వీకి ఎస్వీబీసీ ఛానల్ బాధ్యతలు కూడా దక్కాయి. చిత్రమేంటంటే, మరో కమెడియన్ అలీకి ఎలాంటి పదవీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవ్వలేదు. పోసానికి సైతం వైఎస్ జగన్ నుంచి ఎలాంటి ‘తీపి కబురూ’ అందలేదు. అంతెందుకు, సీనియర్ నటుడు మోహన్ బాబు సైతం, వైసీపీ నుంచి ఎలాంటి ‘పదవీ’ పొందలేకపోయిన సంగతి తెలిసిందే.
తనకు వైఎస్ జగన్ అంతటి గౌరవం ఇచ్చినందుకు పృధ్వీ ఎలా వుండాలి.? కానీ, నిర్లక్ష్యం వహించాడు. లేకితనం చూపారు. ఫలితం, పదవి నుంచి బయటకు గెంటివేయబడ్డాడు. ఇప్పడాయన జనసేన మీద ప్రేమ కురిపిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీతోనూ సన్నిహితంగా వుంటున్నాడు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే, పృధ్వీ రెండు పార్టీల్లోనూ కర్చీఫ్ వేశాడట. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న నియోజకవర్గాన్ని ఇప్పటికే ఖరారు చేసుకున్న పృధ్వీ, ఏ పార్టీ ఆ టిక్కెట్ ఇస్తే, ఆ పార్టీలో చేరిపోతాడట. ప్రస్తుతానికైతే జనసేన మీద ఆశతో వున్నాడు పృధ్వీ.