ఐటి దాడులు : ఏపి ఏమన్నా ప్రత్యేక దేశమా ?..చంద్రబాబు సొంత ఆస్తా ?

చంద్రబాబునాయుడు మాటలు చూస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్ అన్నది భారతదేశంలో అంతర్భాగమేనా అన్న సందేహాలు వస్తున్నాయి. కేంద్రప్రభుత్వ చట్టాలు దేశంలోని అన్నీ రాష్ట్రాలకూ సమానంగా వర్తిస్తాయనే ఇప్పటి వరకూ అందరూ అనుకుంటున్నారు. కానీ తాజాగా చంద్రబాబు మాటలు విన్నవారికి కేంద్రం చట్టాలు ఏపికి వర్తించవనే అనిపిస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే గురు, శుక్రవారాల్లో కొందరిపై ఐటి దాడులు జరిగాయి. దాడుల వల్ల రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారట. ఐటి దాదులు చేయటమంటే రాష్ట్రంపైనే, ప్రజాస్వామ్యంపైనే దాడిగా క్యాబినెట్ తీర్మానించేయటం విచిత్రంగా ఉంది. ఐటి దుడులు జరక్కుండా సుప్రింకోర్టుకు వెళ్ళాలని ఏకంగా మంత్రివర్గంలోని తీర్మానించేశారు. ఇప్పుడు చెప్పండి జరిగిన ఐటి దాడులకు, చంద్రబాబు నిర్ణయానికి ఏమన్నా సంబంధముందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రధానమంత్రి నరేంద్రమోడినే చంద్రబాబునాయుడు ప్రత్యక్షంగా సవాలు చేస్తున్నట్లుంది. శుక్రవారం విజయవాడ తదితర ప్రాంతాల్లో పలువురిపై జరిగిన ఐటి దాడులే అందుకు కారణమవ్వటం విచిత్రంగా ఉంది. పలువురు వ్యాపారస్తులు, నిర్మాణరంగ సంస్ధలపై ఐటి దాడులు జరిగాయి. అనుమానం వచ్చిన వారిపైన, సంస్ధలపైన ఐటి దాడులు జరగటం చాలా సహజం. యాజమాన్యాలేవో సమాధానాలు చెప్పుకుంటాయి, విచారణను ఎదుర్కోవటం చాలా మామూలు విషయమే. అంతేకాకుండా సోదాలకు వచ్చిన ఐటి అధికారులకు ఇచ్చిన భద్రతను ఉపసంహరించాలని కూడా మంత్రివర్గం తీర్మానించటం మరీ విడ్డూరంగా ఉంది. ఐటి దాడులకు వ్యతిరేకంగా న్యాయస్దానాన్ని ఆశ్రయించే అవకాశాలను పరిశీలించమంటూ చంద్రబాబు న్యాయశాఖ కార్యదర్శిని ఆదేశించటం ఆశ్చర్యంగా ఉంది.

 

అసలు చంద్రబాబు తనను తాను ఏమని ఊహించుకుంటున్నారో అర్ధం కావటం లేదు. ఆంధ్రప్రదేశ్ అన్నది భారతదేశంలో అంతర్భాగమని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. కేంద్రప్రభుత్వ పరిధిలో పనిచేసే ఐటి శాఖ అధికారులు ఎవరిపైనైనా దాడులు జరిపేటపుడు ముందుగా తనకు చెప్పాలని, అనుమతి తీసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నట్లున్నారు. ఐటి అధికారులు అలా చేయకపోవటంతోనే చంద్రబాబు ఇపుడు మండిపోతున్నారు.

 

చంద్రబాబు వైఖరి చూస్తుంటే అందరిలోనూ ఒక అనుమానం మొదలైంది. తాజాగా ఐటి దాడులకు గురైన వాళ్ళంతా టిడిపి ముఖ్యనేతలకు బినామీలా ? అనే సందేహాలు పెరిగిపోతోంది. లేకపోతే ఎవరిపైనో ఐటి దాడులు జరిగితే చంద్రబాబు, మంత్రుల్లో ఎందుకు ఉలికిపాటు ? వ్యాపారస్తులపై ఐటి దాడులు జరిగితే రాష్ట్రంపై దాడి జరగటం ఏంటి ? ప్రజాస్వామ్యంపై దాడిగా వర్ణించమేంటో అర్ధం కావటం లేదు. పైగా ఐటి దాడులను అడ్డుకునేందుకు న్యాయపోరాటం చేయటమేంటో అర్ధమే కావటం లేదు. జరుగుతున్నదంతా చూస్తుంటే చంద్రబాబుపై బిజెపి అధ్యక్షడు కన్న లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలే నిజమేమో అని అనిపిస్తోంది.