ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే రెండు దశల నామినేషన్ల పర్వం పూర్తయింది. శనివారం నుంచి మూడో దశ నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ప్రధాన పార్టీల నేతలు తమ మద్దతుదారుల గెలుపు వ్యూహాలపై కసరత్తు చేస్తుండగా, మరోవైపు అధికారులు పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లపై వేగం పెంచారుఏపీ పంచాయతీ ఎన్నికల మూడో దశ కోసం నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది.
ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 12 తుది గడువు. 17న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక, ఈ నెల 13న రెండో విడత ఎన్నికలు జరగనుండగా, మొత్తం 99,241 నామినేషన్లు దాఖలైనట్టు ఈసీ తెలిపింది. సర్పంచ్ స్థానాలకు 19,399 నామినేషన్లు దాఖలు కాగా, వార్డు స్థానాలకు 79,842 నామినేషన్లు దాఖలయ్యాయి. 8న ఉపసంహరణ గడువు అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను వెల్లడించనున్నట్టు ఈసీ వివరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు దశల్లో 659 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. మొదటి దశలో 173, రెండో దశలో 169, మూడో దశలో 171, నాలుగో దశలో 146 మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి