బ్రేకింగ్ న్యూస్ : చంద్రబాబుకు బిగ్ షాక్…ఏసిబి కోర్టులో విచారణ

చంద్రబాబునాయుడుకు ఏసిబి కోర్టు పెద్ద షాకే ఇచ్చింది. లక్ష్మీపార్వతి వేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వచ్చే నెల 13వ తేదీ నుండి రెగ్యులర్ విచారణ చేపట్టనున్నట్లు ఏసిబి కోర్టు ప్రకటించింది. ఏసిబి కోర్టు స్పీడవ్వటంతో చంద్రబాబుకు ఇబ్బందులు తప్పేట్లు లేదనే అనిపిస్తోంది.

చంద్రబాబుకి ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు లక్ష్మీపార్వతి 2005లోనే చంద్రబాబు పై ఏసిబి కోర్టులో కేసు వేశారు. ఆ కేసును విచారించే ఉద్దేశ్యంతో ఏసిబి కోర్టు నోటీసివ్వగా చంద్రబాబు హైకోర్టుకు వెళ్ళి విచారణపై స్టే తెచ్చుకున్నారు. అంటే అప్పటి నుండి ఆ కేసు స్టే రూపంలో కోల్డు స్టోరేజీలోనే ఉండిపోయింది.

చాలా సంవత్సరాలుగా విచారణకు నోచుకోకుండా స్టేల రూపంలో మగ్గుతున్న కేసులన్నింటినీ తొందరగా విచారించమని సుప్రింకోర్టు ఆదేశాలిచ్చింది. అందులో భాగంగానే ఏసిబి కోర్టు కూడా తమ వద్ద విచారణకు నోచుకోకుండా పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను బయటకు తీసింది. అందులో చంద్రబాబుపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా బయటపడింది.

దాంతో వెంటనే కేసును దుమ్ముదులిపి విచారణకు రెడీ అయ్యింది. అంటే అంతకుముందే హైకోర్టు కూడా కొన్ని కేసులను ఏసిబి కోర్టుకు బదిలీ చేసింది. దాంతో చంద్రబాబుపై పెండింగ్ లో ఉన్న కేసుల విచారణకు కోర్టు నడుం బిగించింది. అందులో భాగంగానే లక్ష్మీపార్వతి వేసిన కేసుకు కాస్త ఊపిరి వచ్చింది. ఏసిబి కోర్టు ఇచ్చిన నోటీసుకు లక్ష్మీపార్వతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. కేసు పూర్వపరాలను విచారించిన ఏసిబి కోర్టు రెగ్యులర్ విచారణను మే 13వ తేదీకి వాయిదా వేసింది.