మాజీ ఇంటలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు కొన్నాళ్లుగా ప్రభుత్వాన్ని తలచుకుని కంగారుపడిపోతున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుకాకుండా చేసి 48 గంటలు కస్టడీలో ఉంచి మరోసారి సస్పెండ్ చేయాలని చూస్తోందని అంటూ వచ్చిన ఆయన నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఇజ్రాయిల్ నుండి సెక్యూరిటీ పరికరాల కొనుగోలు విషయంలో నిబంధనలను ఉల్లంఘించారని ఏబీ వెంకటేశ్వరరావును విధుల నుండి తొలగించి సస్పెండ్ చేశారు.
2017-18లో పోలీసు శాఖ ఆధునికీకరణ కోసం అప్పటి ప్రభుత్వం భద్రతా పరికరాలు కొనుగోలు చేసిన వ్యవహారంలో ఏబీ అక్రమాలకు పాల్పడ్డట్లు నేటి ప్రభుత్వం ఆరోపించింది. ఆయన వలన ప్రభుత్వానికి 10 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, దేశభద్రత విషయంలో ఆయన రాజీపడ్డారని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని కేంద్రానికి తెలిపింది ఏపీ ప్రభుత్వం. అయితే వెంకటేశ్వరరావు కోర్టుకు వెళ్లి తన సస్పెన్షన్ మీద స్టే తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు మరోసారి నోటీసులు పంపింది. దీంతో మళ్ళీ కోర్టుకెక్కిన వెంకటేశ్వరరావు తనను అరెస్ట్ చేయకుండా చూడాలని కోరారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డనాటి నుండి ఆరోపణల పేరుతో తనకు పోస్టింగ్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని, వెంటన్ ఈయనకు పోస్టింగ్ ఇవ్వాలని, రెండుసార్లు లేఖలు రాసినా స్పందన లేదని, మళ్ళీ ఇప్పుడు విచారణ జరిగేలోపు అరెస్ట్ చేసి 48 గంటలు జైల్లో ఉంచి బెయిల్ పొందే వీలులేకుండా చేసి సస్పెండ్ చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఆయన వాదనలు విన్న న్యాయస్థానం మరో రెండు వారాలపాటు వెంకటేశ్వరరావును అరెస్ట్ చేయకూడదని పోలీసులను ఆదేశిస్తూ జనవరి 18లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 18కి వాయిదా వేసింది. ఈ ఉత్తర్వులతో వీకెండ్ అరెస్ట్ భయం నుండి వెంకటేశ్వరరావుకు పెద్ద రిలీఫ్ దొరికినట్లయింది.