పవన్ కల్యాణ్ పార్టీ జనసేన ఎన్నికల గుర్తుకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల సంఘం మరోసారి జనసేన గుర్తుగా గాజు గ్లాస్ ను కేటాయించింది. దీంతో జనసేన స్థాపించి పదేళ్లకు ఇంకా స్థిరమైన గుర్తుకే నోచుకోలేదనే ప్రత్యర్థుల కామెంట్లనుంచి పవన్ కు ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా పవన్ చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గ్లాస్ గుర్తును కేటాయించింది. దీంతో ఎన్నికల సంఘానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. “జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గాజు గ్లాస్ ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేసిన సంగతి విదితమే” అని తెలిపారు.
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్ సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు నాడు పోటీలో నిలిచారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ప్రజలకు సేవ చేయడానికి జనసేన అభ్యర్థులు సన్నద్ధమైన తరుణంలో రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం చాలా సంతోషదాయకం” అని అన్నారు.
“ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు యావన్మంది సిబ్బందికి పేరు పేరునా.. నా తరపున, జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీంతో ఈ ప్రకటనపై విశ్లేషకులు కీలకంగా స్పందిస్తున్నారు.
గతకొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమైనట్లు కనిపిస్తున్న పవన్ కల్యాణ్.. ఏపీతోపాటు తెలంగాణ రాజకీయాల వైపు కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోందని.. ఈ ప్రకటనతో రెండు రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తామని పవన్ చెప్పకనే చెప్పారని అంటున్నారు పరిశీలకులు.
మరోపక్క ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టు తర్వాత పవన్ పొలిటికల్ గా స్పీడ్ పెంచినట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా ములాకత్ లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుని కలిసిన పవన్ కల్యాణ్… టీడీపీతో పొత్తు గురించి కూడా క్లారిటీ ఇచ్చేశారు.
దీంతో టీడీపీలో కొత్త ఉత్సాహం నెలకొందనే కామెంట్లు వినిపిస్తుండగా.. జనసేన నుంచి మాత్రం మిశ్రమ స్పందన వస్తుందని తెలుస్తుంది. ఇంతోటి దానికి స్పెషల్ పార్టీ ఎందుకు… విలీనం చేసేస్తే ఒక పని ఐపోద్ది కదా అనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.