పవన్ కు బాధ్యత పెంచిన కొత్త స్టేట్ మెంట్.. బ్లఫ్ కబుర్లు కాదు కదా?

పవన్ కల్యాణ్ ప్రస్తుతం వారహి యాత్ర 3.0లో ఉన్నసంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా విశాఖలోని జగదాంబ సెంటర్ లో పవన్ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఒక వ్యాఖ్య… ఆయన బాధ్యత పెంచిందని, ఇదైనా నిజమవ్వాలని అంటున్నారు పరిశీలకులు.

అవును… తాజాగా జగదాంబ సెంటర్ లో జరిగిన వారాహి యాత్ర సభలో మైకందుకున్న పవన్… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తనను తాను జాతీయస్థాయి నేతగా చూపించుకునే ప్రయత్నం కూడా చేశారు! ఈ సమయంలో కేంద్రం తనకు సాయం చేస్తుందని, కేంద్రం సాయంతో జగన్ ను ఒక ఆట ఆడిస్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

పవన్ చాలా రొటీన్ గా మాట్లాడే ఇంకా అనేక ఆరోపణలు చేశారు గానీ.. కేంద్రం సాయంతో జగన్ పని పడతానని చెప్పిన మాటలే ఇప్పుడు కీలకం. అలా పట్టకపోతు చూడు అంటూ సవాల్ కూడా చేశారు. దీంతో పవన్ కు కేంద్రంలో అంత గ్రిప్ ఉందా.. కేంద్రంలోని పెద్దలతో పవన్ కు అంత సాన్నిహిత్యం ఉందా అనే చర్చ మొదలైంది.

ఇలా జగన్ పై చేసిన వ్యాఖ్యల సంగతి అలా ఉంటే… నిజంగా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో పవన్ కు అంత సాన్నిహిత్యమే ఉంటే… జగన్ పై కక్ష సాధింపుచర్యల సంగతి కాసేపు పక్కనపెట్టి… విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం కాకుండా ఆపొచ్చు కదా అని అంటున్నారు పరిశీలకులు. ఫలితంగా ప్రజల్లో రియల్ హీరో అనిపించుకోవచ్చు కదా అని సూచిస్తున్నారు.

కేంద్రంలో పెద్దలు పవన్ ఏమి చెబితే అది వినే స్థాయి వ్యక్తులు అయితే.. పవన్ కు ఉన్న ఆ పలుకుబడిని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అవ్వకుండా ఆపొచ్చు కదా అని అడుగుతున్నారు. కానీ… పవన్ మాత్రం ఆ విషయంపై మాత్రం మాట్లాడటం లేదు. జగన్ ని విమర్శించడం, కేంద్రంతో కలిసి అంతుచూస్తాననడానికి మాత్రమే పరిమితం అవుతున్నాడు.

దీంతో… పవన్ వి అన్నీ బొంబాయి కబుర్లని, పవన్ వల్ల అయ్యేదీ లేదు పోయేదీ లేదని పెదవి విరిస్తున్నారు నెటిజన్లు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు పార్లమెంటులో జగన్ సహాయాన్ని కోరుతూ, పొందుతున్న సంగతి పవన్ కు తెలియకపోవడం ఆయన రాజకీయ పరిపక్వతకి నిదర్శనం అని అంటున్నారు.