వెన్నుపోటుపై ‘బాల-చంద్ర’ యత్నం.! ఓ వృధా ప్రయాస.!

అసలు ‘వెన్నుపోటు’ వ్యవహారం గురించి ఇంకోసారి వివరణ ఇచ్చుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ఎందుకు అనిపించింది.? ఈ విషయమై తన పరువు పోగొట్టుకోవడానికి బాలకృష్ణ ఎందుకు సమాయత్తమయ్యారు.? యువకుడిగా వున్నాడు గనుక, అమ్మాయిలతో ‘ఎంజాయ్మెంట్’ తప్పు కాదన్నట్టుగా లోకేష్ ఎందుకు చెప్పుకోవాలనుకున్నట్టు.?

ఎన్నెన్నో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయ్ ‘అన్‌స్టాపబుల్’ వ్యవహారంతో. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ఓటీటీ టాక్ షో ద్వారా బాలకృష్ణ ఏం సాధించారు.? చంద్రబాబుకి ఏం లాభం కలిగింది.? నారా లోకేష్‌కి ఉపయోగమేంటి.? అన్నదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అన్నిటా ఒకటే ఫైనల్ ఔట్‌పుట్. ఇదొక ఫ్లాప్ షో అని.

అంటే, టాక్ షో ఫ్లాప్ అని కాదు.! అనుకున్న ప్రయోజనం పొందడంలో ముగ్గురూ ఫ్లాప్ అయ్యారని. ‘వెన్నుపోటు’ వ్యవహారం గురించి ప్రజలెవరూ కొత్తగా ఏమీ తెలుసుకోవాలనుకోవడంలేదు. ఎందుకంటే, అది జరిగిపోయిన కథ. అది ఓ చరిత్ర. బాధితుడైన ఎన్టీయార్ స్వయంగా అప్పుడేం జరిగిందో చెప్పిన వీడియోలు సాక్ష్యంగా ఇప్పటికీ వున్నాయ్. సో, బుకాయించడం అనవసరం.

‘వాళ్ళు అలాగే అంటారు.. లైట్ తీసుకోవడమే.. నో కామెంట్’ అనేస్తే పోయేదానికి, ‘నందమూరి – నారా’ త్రయం నానా పాట్లూ పడి, చివరికి నష్టపోయారు. ఈ విషయంలో ఇంకోసారి చర్చనీయాంశమవడంతో చంద్రబాబుతోపాటు ఈసారి ఇంకా గట్టిగా బాలయ్యనీ తిడుతున్నారు స్వర్గీయ ఎన్టీయార్ అభిమానులు. లోకేష్ సంగతి సరే సరి.. సభ్య సమాజానికి ఆ ఫొటోలతో ఏం సంకేతాలిచ్చావ్.? అని నిలదీస్తున్నారు. మధ్యలో బ్రాహ్మణి పరువు కూడా తీసేశారు.. ఈ ముగ్గురూ.!