రాజకీయాలు చాలా ఖరీదైపోయాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటేనే బోల్డంత ఖర్చు చేయాలి. అదే ఎంపీ అంటే, ఇంకా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. గతంలో.. అంటే, 2019 ఎన్నికల్లో ఓ ఎంపీ సీటు కోసం ఏకంగా 500 కోట్లు ఖర్చయ్యిందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.
ఇది మరీ టూమచ్.! అదేదో ‘బాగా పెద్దది చేసి చూపించిన ఫిగర్’ అనేవారూ లేకపోలేదు. ఏకంగా రెండు మూడు నియోజకవర్గాల్లో ఆ స్థాయి ఖర్చు జరిగిందంటారు. అది వేరే సంగతి. ఆ స్థాయిలో కాకపోయినా, అందులో సగం అయినా తప్పదు.. ఎంపీగా పోటీ చేయాలంటే.
జనసేన పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంపీ అభ్యర్థులు ఎవరున్నారబ్బా.? అని ఆరా తీస్తే, ప్చ్.. అభ్యర్థులు కనిపించడంలేదు.. ఒక్క నాగబాబు తప్ప. ఆయన గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేశారు. రఘురామకృష్ణరాజు చేతిలో ఓడిపోయారు కూడా.
ఈసారి నాగబాబుకి ఓపిక లేదు. ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన గతంలోనే ప్రకటించేశారు. అసలు ఇప్పుడీ చర్చ అంతా ఎందుకు.? అంటే, పొత్తులో భాగంగా టీడీపీ నుంచి జనసేన ఏకంగా 8 నుంచి 10 ఎంపీ సీట్లను అడుగుతోందంటూ గాసిప్స్ వినిపిస్తుండడం వల్లే.
నిజానికి, జనసేనకి అంత సీన్ లేదు. ఏదో మొహమాటానికి ఓ నాలగు ఎంపీ సీట్లను అడగొచ్చు. ఓ రెండు సీట్లతో సరిపెట్టుకోమని టీడీపీ, జనసేనకు చెప్పొచ్చు. అంతకు మించి జనసేన ఎక్కువ సీట్లలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోవచ్చు. గెలిచే సీట్లను వీలైనన్ని ఎక్కువ లాక్కోవాలని మాత్రమే జనసేన భావిస్తోంది.