కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం కేంద్ర బడ్జెట్-2021ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలు తమకు ఎంతమేర కేటాయింపులు జరిగాయనే దానిపై లెక్కలు వేసుకుంటున్నాయి. అయితే ఈ బడ్జెట్‌లో ఏపీకి నిరాశ మిగిలిందనే మాట వినిపిస్తోంది. రాష్ట్ర విభజనతో ఆర్థిక లోటు, ఇతర సమస్యలను ఎదుర్కొంటున్న ఏపీకి అండగా నిలవాల్సిన కేంద్రం.. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అంటున్నారు.
ఇక, కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర విభజన కారణంగా అనేక రంగాల వారీగా భారీ నష్టం ఏర్పడిందని, ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ పట్ల ఆశగా చూశామని అధికారులు సీఎం తెలిపారు. అయినా కేంద్రం రాష్ట్రానికి ఎటువంటి ప్రత్యేక కేటాయింపులు చేయలేదని అధికారులు సీఎంకు వివరించారు.
పీఎం కిసాన్, పీఎం ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకాలకు గత ఏడాదితో పోలిస్తే కేటాయింపులు తగ్గాయని సీఎంకు అధికారులు వివరించారు. పెట్రోల్, ఫెర్టిలైజర్స్ సబ్సిడీలను కూడా తగ్గించారని చెప్పారు. తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలతో సమాన స్థాయిలో రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు జరగలేదని అన్నారు. అనంతరం సీఎం జగన్ స్పందిస్తూ.. కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపుల్లో వీలైనన్ని నిధులను రాష్ట్రానికి తీసుకు రావడానికి అధికారులు గట్టి ప్రయత్నాలు చేయాలని సూచించారు.
ఇక, బడ్జెట్‌లో విశాఖలో మేజర్ ఫిషింగ్ హార్బర్, ఖరగ్‌పూర్-విజయవాడ, ఇటార్సీ-విజయవాడ మధ్య ప్రత్యేక సరకు రవాణా రైల్వే కారిడార్లు, చిత్తూరు-తాచ్చూరు జాతీయ రహదారి ప్రాజెక్టులను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే ఇవి జాతీయ రహదారి ప్రాజెక్టుల కావడం వల్ల వాటితో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏపీకి ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.