మేముంటే హరికృష్ణ బతికే వాడే : షాకింగ్ ట్విస్ట్

నందమూరి హరికృష్ణ మరణవార్త తన అభిమానులనే కాక తెలుగు ప్రజలను ఆవేదనకు గురిచేసింది. ఆయన మరణించి 48 గంటలు అవుతున్నా ఇంకా అభిమానులు కోలుకోలేదు. సీతయ్య మరణం వెనుక అసలు కారణాలేంటన్నదానిపై ఇంకా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. నల్లగొండ పోలీసులు హరికృష్ణ మరణానికి రెండు ప్రధాన కారణాలను చూపుతున్నారు. మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ‘మేము ఉంటే హరికృష్ణను బతికించేవాళ్లమే అని ఒక యూనియన్ నేత చెబుతున్నారు. ఎవరా యూనియన్ నేత? అసలు వాళ్లు ఎలా హరికృష్ణ ప్రాణాలు కాపాడేవారు? వివరాలు కింద చదవండి.

నల్లగొండ జిల్లా రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ రెండు కారణాల వల్ల మరణించారని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. అందులో ఒకటి 160 కిలోమీటర్ల వేగంతో హరికృష్ణ కారు నడుపుతున్నాడు అనేది. మరొకటి హరికృష్ణ సీటు బెల్టు పెట్టుకోలేదు కాబట్టి అని.

అసలు కారు ప్రమాదం జరగడానికి కారణంగా పోలీసులు, హరికృష్ణతోపాటు కారులో ప్రయాణిస్తున్నవారు చెప్పిందేమంటే… కారు నడుపుతున్న క్రమంలో హరికృష్ణ వాటర్ బాటిల్ కోసం వెనకకు చూశారు. ఆ సమయంలో రెప్పపాటులోనే కారు అదుపుతప్పి బోల్తా కొట్టిందని అంటున్నారు. ఆ ప్రదేశంలో రోడ్డు మలుపులు కూడా కారణమని అంటున్నారు.

108 ఉద్యోగుల ఆందోళన

ఇదంతా జరిగినా కూడా.. మేమే కనుక ఉంటే హరికృష్ణ ప్రాణాలు కాపాడే వాళ్లము అని చెబుతున్న వారు ఎవరో కాదు.. 108 అంబులెన్స్ సిబ్బంది. మరి వాళ్లు ఎందుకు కాపాడలేకపోయారు? ఆ సమయంలో వారు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం ఏమంటే.. తెలంగాణలో ఆగస్టు 14వ తేదీ నుంచి గత 18 రోజులుగా 108 అంబులెన్స్ సిబ్బంది సమ్మె చేస్తున్నారు. నెలల తరబడి తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నా సర్కారు పట్టించుకోలేదని వారు ఆవేదన చెంది సమ్మెకు దిగారు. ఎమర్జెన్సీ సర్వీసులో ఉన్న 108 సిబ్బంది సమ్మె చేస్తున్నా 108 నిర్వహణ సంస్థ జివికె యాజమాన్యం పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.

దీక్షలు చేస్తున్న 108 ఉద్యోగులు

108 సిబ్బంది 18 రోజులుగా సమ్మెలో ఉండడంతో ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఐదుగురు గర్భిణీ స్త్రీలు వైద్యం అందక చనిపోయారు. వారేకాకుండా సినీ నటుడు నందమూరి హరికృష్ణ కూడా ప్రాణాలు కోల్పోయారని వారు చెబుతున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర 108 ఉద్యోగుల యూనియన్ అధ్యక్షులు అశోక్ పల్లె చెబుతున్నారు. ఆయన ‘తెలుగురాజ్యం’తో మాట్లాడుతూ కీలకమైన విషయాలు వెల్లడించారు. జివికె ఇఎంఆర్ఐ అసమర్థత, వైఫల్యం కారణంగానే హరికృష్ణతోపాటు మరో 20 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఆయన అంటున్నారు. అశోక్ చెప్పిన వివరాలివి…

అర్ధ నగ్న నిరసనకు దిగిన 108 ఉద్యోగులు

 

‘‘మేము (108 అంబులెన్స్ సిబ్బంది) సమ్మెలో లేకపోతే హరికృష్ణ ప్రాణాలు కాపాడే చాన్స్ ఉండేది. సకాలంలో వైద్యం అందిచడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడాము. ఇలాంటి ఎన్నో హెడ్ ఇంజ్యూరీ కేసులను కూడా కాపాడాము. మేము డ్యూటీలో ఉండి ఉంటే.. ఓవర్ బ్లీడింగ్ ఉన్నది కాబట్టి ఐబి క్యానులా ను నరాలకు పెట్టేవాళ్లం. దాంతోపాటు ఫ్లూయిడ్ ఎక్కిస్తాము. దీనిద్వారా వెంటనే ఓవర్ బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. సంఘటనా స్థలంలోనే గాయాలకు బ్యాండేజీ కడతాము. తలకు తీవ్రమైన గాయాలయ్యాయి కాబట్టి ఆక్సిజన్ అందే చాన్స్ తక్కువ. కాబట్టి మేము ఉంటే ఆక్సిజన్ అరెంజ్ చేసేవాళ్లం. పల్స్ చెక్ చేస్తాము. హాట్ బీటింగ్ ఎలా ఉందో చూస్తూ ఆసుపత్రికి తరలించేవాళ్లం. ఒకవేళ ఆక్సిజన్ తీసుకోలేని పరిస్థితి ఉంటే ఆంబూ బ్యాగ్ నోటిదగ్గర పెట్టి ఆక్సిజన్ అందించేవాళ్లం. మేము డ్యూటీలో ఉండి ఉంటే హరికృష్ణ ప్రాణాలు దక్కేవని మేము నమ్ముతున్నాం.

ఉదయం ఆరు గంటల ప్రాంతంలో యాక్సిడెంట్ లో గాయాలతో హరికృష్ణ పడి ఉన్న సమయంలో సైదులు అనే ప్రత్యక్ష సాక్షి తక్షణమే 108 కు కాల్ చేశాడు. కానీ ఆ సమయంలో 108 వాహనాలు అందుబాటులో లేవు.. బిజీగా ఉన్నాయని వారికి సమాధానం వచ్చింది. ఎన్నిసార్లు 108 కు కాల్ చేసినా వాహనాలు లేవనే సమాధానం వచ్చింది. కానీ మేము దానిపై ఆరా తీస్తే వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిసింది. యాక్సిడెంట్ కేసులకు కావాలనే అంబులెన్స్ లు లేవని చెప్పారని మాకు అర్థమైంది. 108 వాహనాలు అందుబాటులో లేవని చెప్పడంతో వేరే వాహనంలో హరికృష్ణను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆలస్యమై సకాలంలో వైద్యం అందకపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

గత 18 రోజులుగా మేమంతా సమ్మెకు దిగిన తర్వాత ఆటో డ్రైవర్లను, అడ్డ మీద డ్రైవర్లను 108 వాహనాలు నడిపేందుకు ఎంగేజ్ చేసుకుంటున్నారు. దాంతో సీరియస్ కేసుల విషయంలో ఫోన్ రాగానే 108 బండ్లు అందుబాటులో లేవని, బిజి అని సమాధానం చెబుతున్నారు. కండ్లు తిరిగి పడిపోవడం లాంటి చిన్న చిన్న ప్రమాదం ఉన్న కేసులకు మాత్రమే అంబులెన్స్ లు పంపుతున్నారు. ఇదంతా జివికె ఇఎంఆర్ఐ వైఫల్యంగానే జనాలు అర్థం చేసుకోవాలి.’’

 

సమ్మెలో ఉన్న 1500 మంది అంబులెన్స్ సిబ్బంది

ఎమర్జెన్సీ ఉద్యోగులైన తాము గత 18 రోజులుగా సమ్మె చేస్తున్నా జివికె యాజమాన్యానికి చీమ కుట్టినట్లు కూడా లేదని అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమ్మెలో అంబులెన్స్ వాహనంలో తిరిగే వారు  ఇఆర్ ఓ (ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆఫీసర్), ఇఎంటి (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్), 108 వాహన పైలెట్ (అంబులెన్స్ డ్రైవర్) లు సమ్మెలో ఉన్నారు. తెలంగాణలో మొత్తం 317 అంబులెన్స్ ల సిబ్బంది 1587 మందిలో 1532 మంది సమ్మెలో ఉన్నారు. దీంతో ఆటో డ్రైవర్లు, అడ్డ మీది డ్రైవర్లు మాత్రమే అంబులెన్స్ నడుపుతుతున్నారని వారు తెలిపారు.

సమ్మె ఎందుకంటే…?

దేశమంతా 8గంటల పని విధానం అమలులో ఉంటే 108 అంబులెన్స్ సిబ్బందికి మాత్రం 12 గంటల పని విధానం అమలులో ఉంది. అందరి మాదిరిగానే తమకు కూడా తక్షణమే 8 గంటల పని విధానం అమలు చేయాలి.

13 ఏండ్లుగా ఈ సంస్థలో పని చేస్తున్నాము. కానీ ఉద్యోగ భద్రత లేదు. చిన్న చిన్న కారణాలు చూపి ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నారు.

మాకు ఇస్తున్న జీతాలు ప్రభుత్వ చట్టాల ప్రకారం ఇవ్వాలి. జిఓ నెంబరు 3 ప్రకారం జీతాలు ఇవ్వాలని అడుగుతున్నాం. అలా ఇవ్వకపోవడం వల్ల అందరు ఉద్యోగులకు జీతాలు పెరుగుతున్నాయి. మాకు పెరగడంలేదు. దీంతో ప్రతిసారి జీతాల కోసం ఆందోళనలు చేయాల్సి వస్తున్నది. 

108 వ్యవస్థలో మా మూడు కేటగిరీ వారికి కనీస గుర్తింపే లేదు. తక్షణమే మమ్మల్ని పారామెడికల్ రికార్డుల్లో గుర్తించాలి. అన్ని ఏజెన్సీల కింద పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించినట్లే మమ్మల్ని కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రయివేటు ఉద్యోగులుగా మమ్మల్ని చెబుతున్నారు.  

ఎమర్జెన్సీ సర్వీస్ పేరుతో 108కు వంద శాతం నిధులు ఇస్తున్నారు కాబట్టి మేము ఈ సదుపాయాలు అడుగుతున్నాము.

8గంటల పని విధానం అమలు చేస్తే తెలంగాణ నిరుద్యోగులకు మరో 700 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది.

ఆందోళన చేస్తున్న 108 సిబ్బంది

జివికె యాజమాన్యం మొండి వైఖరి, తెలంగాణ సర్కారు పట్టించుకోకపోవడంతో తాము సమ్మెకు దిగాల్సి వచ్చిందని అశోక్ తెలిపారు. మరోవైపు న్యాయ పోరాటం కూడా చేస్తున్నామని చెప్పారు. చట్టాల ఉల్లంఘనలపై హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశామన్నారు. తాము సమ్మెలో ఉన్నందున అత్యవసర సేవలు అందకపోవడంతో ఈ 18 రోజుల్లో 20 మంది చనిపోయారని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అశోక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనే ఐదుగురు గర్బిణీ స్త్రీలు చనిపోయారన్నారు. మహబూబ్ నగర్ లో పాము కాటు కు సరిత అనే అమ్మాయి సకాలంలో వైద్యం అందక మరణించినట్లు చెప్పారు.  

ఇదిలా ఉంటే వీరిలో వెయ్యి మందిని ఉద్యోగాల్లోంచి తొలగించామని, తక్షణమే కొత్త రిక్రూట్ మెంట్ జరుపుతున్నామని జివికె యాజమాన్యం ప్రకటనలు జారీ చేసింది. ఈ చర్యపై 108 ఉద్యోగులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ కారణంగా వెయ్యి మందిని తొలిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. 13 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని ఒక్క కలం పోటుతో తీసేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అలా చేస్తే కార్మిక చట్టాల ప్రకారం జివికె యాజమాన్యంతోపాటు ప్రభుత్వం కూడా దోషిగా నిలబడక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.  తక్షణమే తెలంగాణ సర్కారు జోక్యం చేసుకుని తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు.

సమ్మెపై ఉద్యోగులు ఏమంటున్నారో కింద వీడియోలో చూడండి.