మరోసారి తెరపైకి “జామాతా దశమగ్రహ”!

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకల సభ ఈ రోజు జరగనుంది. ఈ సభలో… ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలకు సంబంధించి రెండు పుస్తకాల విడుదల చేయనున్నారు. అసెంబ్లీలో ఎన్టీఆర్ ప్రసంగాలు, అలాగే ప్రజల్ని ఉద్దేశించి వివిధ సంద‌ర్భాల్లో ఆయ‌న‌ చేసిన ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్, టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, వారికి నచ్చిన కొంతమంది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు త‌మిళ సూప‌ర్‌ స్టార్ ర‌జినీకాంత్ ఇప్పటికే విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ర‌జినీకాంత్‌ కు.. హిందూపురం ఎమ్మెల్యే, దివంగ‌త ఎన్టీఆర్ త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ స్వాగ‌తం ప‌లికారు. ఎన్టీఆర్‌ ను వెన్నుపోటు పొడిచార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న చంద్రబాబు, ఆ సమయంలో బాబుకు మద్దతు ఇచ్చిన ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు, సహకరించిన టీడీపీ నాయ‌కులంతా క‌లిసి… ఆ దివంగ‌త నేత శ‌త జ‌యంతి వేడుకలు నిర్వహిస్తున్నారనే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న సంగతి కాసేపు పక్కనపెడితే… ఈ శతజయంతి వేడుకల సభపై ఆన్ లైన్ వేదికగా రకరకాల ప్రశ్నలు, రకరకాల సెటైర్లు పడుతుండటం విశేషం.

ఈ చారిత్రక ప్రసంగాల పుస్తకంలో… ఎన్టీఆర్ చివ‌రి రోజుల్లో త‌న అల్లుడు చంద్రబాబుపై విడుద‌ల చేసిన వీడియోలోని అంశాలు కూడా ఉంటాయా? అని నెటిజ‌న్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో… “జామాతా దశమగ్రహ” పేరుతో పాపులారిటీ సంపాదించుకున్న ఆ ప్రసంగం మరోసారి తెరపైకి వచ్చింది. అసెంబ్లీలోనూ, సభల్లోనూ కాకుండా ఎన్టీఆర్ చేసిన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రసంగాల్లో ఇదే అసలు సిసలు చారిత్రకమైన ప్రసంగం అని.. నిజంగా ఎన్టీఆర్ ని అభిమానించేవారు ఈ వీడియోలో పెద్దాయన మాటల్ని మరిచిపోలేరని చెబుతున్నారు! ఇదే సమయంలో… ఈ ఉత్సవాల్లో… నందమూరి తారకరామారావు (జూ.ఎన్టీఆర్) పాల్గొంటున్నారా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇకపోతే.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు అనుమోలు గార్డెన్స్‌ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ వేడుకల్లో 10 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణాన్ని మూడు భాగాలుగా విభజించారు. “ఎన్” విభాగంలో విశిష్ట అతిథులు, “టి” విభాగంలో అతిథులు, “ఆర్” విభాగంలో సామాన్యులు కూర్చునేందుకు వీలుగా కమిటీ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం సాయంత్రం 4.30 గంటల నుంచి గ్యాలరీల్లోకి ప్రజలను అనుమతిస్తారు. ప్రాంగణం చుట్టూ మరో 20 వేల మంది వరకు కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. దీనిపై కూడా సెటైర్స్ వేస్తున్న నెటిజన్లు… ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ మాత్రం హడావిడి ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.