సిఎం రమేష్ ‘కడప ఉక్కు’ దీక్ష వెనక రాజకీయం ఉందా?

అవునంటున్నది బిజెపి

 

టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్  కడప ఉక్కు మీద అందరికంటే ఎక్కువగా రెచ్చిపోయి ఆమరణ నిరాహారదీక్ష కు పూనుకుని 10 రోజులు దీక్ష చేశారు. ఆ తర్వాత, ఇక లాభం లేదు, ఎక్కువ కాలం చేస్తే బాగుండదనుకుని  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  హుటాహుటిని కడప వెళ్లి నిమ్మ రసం ఇచ్చి, దీక్షా పడక మీద నుంచి రమేష్ ను లేపి కూచో బెట్టారు. తర్వాత చంద్రబాబ నాయుడు ఈ దీక్షను అమరజీవి పొట్టి శ్రీరాములు దీక్ష తో పొల్చారు. తెగపొగిడారు. అంతేకాదు, స్టీల్ ప్లాంట్ కు మనమే శంకు స్థాపనచేసుకుందామని అని కూడా అన్నారు. ఇంత ఉత్సాహం ఇపుడే ఎందుకొచ్చింది.  కేంద్రం నుంచి స్పందన రానపుడు, మన స్టీల్ ప్లాంట్ మనమే శంకుస్థాపన అనేసి ఆపనేదో పూర్తి చేసి ఉంటే  ఈ పాటికి ప్లాంట్ నిర్మాణం దాదాపూ పూర్తవుతూ వుండేది. అలా కాకుండా ఇపుడు రమేష్ చేత ఆమరణ నిరాహార దీక్ష చేయించడం, ఫ్యాక్టరీని మనమే కట్టుకుంటామని ఆవేశపడటం లో ఆంతర్యం ఏమిటి?

ఇదంతా డ్రామా అని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు  జివిఎల్ నరసింహారావు అంటున్నారు

రమేష్ ది దొంగ దీక్ష అని, చంద్రబాబునాయుడు ఉసి గొలిపి  దీక్ష చేయించాడని దానికి కారణం ఉందని  బిజెపి జాతీయ అధికార ప్రతినిధి  జివిఎల్ నరసింహారావు అంటున్నారు. ఈ రోజు విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ఇదంతా బోగస్ దీక్ష అని ఆయన వర్ణించారు. ఈ బోగస్ దీక్ష ఎందుకు చేయించాల్సి వచ్చిందో కూడా ఆయన వివరించారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రాకుండా అడ్డుకున్నది చంద్రబాబు నాయుడే నని, ఇపుడు ఆ విషయం బయటపడుతుందని భయపడి, రమేష్ ను ఆమరణ దీక్షను వుసిగొల్పి ‘డ్రామా’ అడాడని ఆయన ఆరోపిస్తున్నారు.

ఓవైపు కేంద్రం నుంచి  దొంగచాటుగా నిధులు తీసుకుంటూ మరోవైపు దొంగదీక్షలు చేయిస్తున్నారని ఆయన అన్నారు.

‘కడపలో ఉక్కు పరిశ్రమ రాకుండా 7నెలలుగా అడ్డుకుంది రాష్ట ప్రభుత్వమే. మేం ఆవిషయాన్ని బయటపెట్టాకే రాష్ట్ర గనుల శాఖ నుంచి కేంద్రానికి హడావిడిగా నివేదిక పంపారు,’ అని నరసింహారావు తెలిపారు.

‘హోదా కోసం పోరాడే వారు చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలి. ఉద్యమం చేస్తున్నా చలసాని శ్రీనివాస్ ఇప్పటికైనా చంద్రబాబు వైఖరి గుర్తించాలి.రాష్ట్ర ప్రభుత్వం తన పాలనా వైఫల్యాల్ని కేంద్రంపై మళ్లించేందుకు యత్నిస్తోంది,’ ఆయన చెప్పారు.

దీక్షల పేరిట ప్రజలను మోసం చేయొద్దని అంటూ ఉక్కు పరిశ్రమ ఇస్తామని చెబుతున్నా దీక్షకు దిగి నవ్వుల పాలయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. ‘సినిమా తరహాలో రాజకీయాలు చేస్తున్నారు తప్పితే ప్రజల మేలు తెదేపాకు పట్టదు.మీ ఎంపీల మాటలతో దొంగదీక్షల బాగోతం బట్టబయలైంది.జనాల్ని భయపెట్టి దీక్షలకు తరలిస్తున్నారు.ఏపీకి గచ నాలుగేళ్లుగా చంద్ర గ్రహణం పట్టింది,’ అని జివిఎల్ అన్నారు. తిరుపతిలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీద టిడిపి నేతలు దాడి చేయడం ప్రస్తావిస్తూ  జెడ్ కేటగిరి భద్రత ఉన్న అమిత్ షా పై దాడికి యత్నించారు, మీరు ఢిల్లీ వస్తారు కదా… మేం కూడా అదే పని చేస్తే ఏం చేస్తారు అని ప్రశ్నించారు. సామాజిక మాద్యమాల్లో మాపై ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టిస్తున్నారని, ప్రతి వెదవకు భయపడాల్సిన పనిలేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.