శంక‌ర్ స్టూడియో క‌ట్ట‌డం క‌ష్ట‌మేనా?

ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు ఎన్‌. శంక‌ర్ `జై బోలో తెలంగాణ‌` చిత్రాన్ని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయ‌నే. ఈ విష‌యాన్ని అడ్డుపెట్టుకుని న‌ల్ల‌గొండ ఎమ్మెల్యేగా గులాబీ పార్టీ త‌రుపున టిక్కెట్‌ని ఆశించారు. కానీ పాచిక పార‌క‌పోవ‌డంతో రాత్రికి రాత్రే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌లో చేరి ట‌క్కెట్ కోసం ప్ర‌య‌త్నించారు. కాంగ్రెస్ ఓ మ‌హాస‌ముద్రం అని ఇందులో చేరి త‌ప్పుచేశాని తెలుసుకుని తిరిగి గులాబీ పార్టీకి స‌న్నిహితుడ‌య్యారు.

గ‌త ఎన్నిక‌ల్లో గులాబీ పార్టీకి శంక‌ర్ పార్టీ ప్ర‌చార యాడ్‌లు చేయ‌డ‌మే కాకుండా ఇండ‌స్ట్రీకి సంబంధించిన మిగ‌తా యంగ్ డైరెక్ట‌ర్ల‌తో పార్టీ కోసం యాడ్ లు చేయించారు. దీంతో ఎన్‌.శంక‌ర్‌పై తెలంగాణ ప్ర‌భుత్వానికి సాఫ్ట్ కార్న‌ర్ మొద‌లైంది. ఇదే అద‌నుగా ఐదెక‌రాల స్థలాన్ని రంగారెడ్డి జిల్లా శంక‌రప‌ల్లి స‌మీపంలో మోకిల్లా గ్రామంలో గ‌త ఏడాది 21న కేటాయించింది. స్థ‌లం కేటాయించి ఏడాది కావ‌స్తున్నా ఆ స్థ‌లంలో ద‌ర్శ‌కుడు ఎన్‌. శంక‌ర్ ఎలాంటి స్టూడియో నిర్మాణం చేప‌ట్ట‌లేదు.

దీంతో కోట్లు ప‌లికే విలువైన భూమిని ఎక‌రానికి 5 ల‌క్ష‌ల ఖ‌రీదుతో శంక‌ర్‌కు అప్ప‌గించ‌డం చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని, శంక‌ర్‌కు స్థలాన్ని కేటాయిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న జీవోని వెంట‌నే ర‌ద్దు చేయాలంటూ జ‌గిత్యాల‌కు చెందిన జె.శంక‌ర్ హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని వేశారు. దీంతో శంక‌ర్ స్టూడియో స్థ‌లం ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డిపోయింది.

శంక‌ర్ పిటీష‌న్‌ని స్వీక‌రించిన ధ‌ర్మాస‌నం డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో పాటు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారుల‌కు నోటీసులు జారీచేయ‌డం చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌దుప‌రి విచార‌ణ‌ను నాలుగు వారాల‌కు వాయిదా వేసింది. శంక‌ర్‌పై కోపంగా వున్న వాళ్లు భ‌లే జ‌రిగింద‌ని సంబ‌ర‌ప‌డిపోతుంటే అత‌ని మ‌ద్దతుదారులు మాత్రం స్టూడియో నిర్మాణం చేప‌ట్ట‌క‌ముందే ఏంటీ ఇలా జ‌రుగుతోందంటూ వాపోతున్నార‌ట‌.