ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల నగారా మోగింది.. ఎన్నికలు జరుగుతాయో లేదో అన్న అనుమానాలు వీడిపోయి షెడ్యూల్ విడుదలయ్యే సరికి పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. నేటి నుండే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రావడంతో ఇప్పుడు గెలుపు, ఓటములతోపాటు ప్రత్యర్థి పార్టీల చర్యలపై కూడా నిఘా పెట్టే పనిలో పడ్డాయి.
త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆ పార్టీ ఎన్నికలు వాయిదా పడతాయని ఆశించింది. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వైసీపీపై ఎలాగైనా విజయం సాధించాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.
ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచినట్టు గెలిచిన తర్వాత రుజువైనా అనర్హత వైటు, అభ్యర్థిని జైలుకు పంపేలా తీసుకొచ్చిన చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ వైసీపీ అభ్యర్థులు డబ్బు, మద్యం పంచితే ఏం చేయాలనే దానిపై టీడీపీ దృష్టి సారించింది. అయితే అధికార పార్టీ అభ్యర్థులపై పోలీసులు చర్యలు తీసుకునే అవకాశాలు ఉండవు అని భావిస్తోన్న టీడీపీ అసలు డబ్బు, మద్యం పంపిణీ చేస్తే అడ్డుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఫొటోలు, వీడియోలు తీసి పంపాలని నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. కేవలం వీటికోసమే ఎన్టీఆర్ భవన్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటుచేయబోతున్నారు.
ఫొటోలను, వీడియోలను ప్రసారం చేసేందుకు మీడియాను సద్వినియోగం చేసుకోవాలని, అధికారులకు ఫిర్యాదులు చేయాలని అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు, కార్యకర్తలకు సూచించారు. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో విజయం టీడీపీకి తప్పనిసరి పరిస్థితి అని, క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఓ వైపు ఎన్నికల సమరంలో.. మరోవైపు కోర్టుల్లో న్యాయ పోరాటం రెండు వ్యూహాలను అనుసరించాలని నిర్ణయించారు. నేతలెవరూ అధైర్యపడకుండా విజయం మనదే అని మనస్ఫూర్తిగా నమ్మి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. వీరోచితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.