బెజవాడ గ్యాంగ్ వార్ లో జరిగింది అదే !

 
బెజవాడ అంటేనే రౌడీల  అరాచకాలకు మారు పేరుగా గుర్తుకు వస్తోంది.  వంగవీటి రంగా కాలం నాటి కక్షలు కార్పణ్యాల పై ఉన్న ఎన్నో వివాదాలతో పాటు రోజుకొక గొడవలు అల్లర్లతో ఇప్పటికీ బెజవాడ రగులుతున్న అగ్ని పర్వతమే.  ముఖ్యంగా ఇక్కడి రౌడీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాష్ట్రంలో అన్నీ ప్రాంతాల కంటే బెజవాడలో  రౌడీల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.  ఇటీవలే చోటు చేసుకున్న బెజవాడ గ్యాంగ్ వార్ కు సంబంధించి కేసులో విచారణ పూర్తయింది. గ్యాంగ్‌ లీడర్‌ పండుతో సహా  మొత్తం 13 మంది స్ట్రీట్‌ ఫైటర్స్‌ ను  పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించామని.. త్వరలోనే మిగిలినవారిని కూడా అరెస్ట్ చేస్తామని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. 
 
ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ విషయంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణలో భాగంగా ‘పండు గ్యాంగ్‌ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన సందీప్‌ చనిపోయాడు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే గతంలో పండు, సందీప్‌ మంచి స్నేహితులు. ల్యాండ్‌ సెటిల్‌ మెంట్‌లోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.  ప్రదీప్‌ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి అనే వ్యక్తుల మధ్య అపార్ట్‌మెంట్‌ నిర్మాణంలో వివాదం తలెత్తింది.  వీరి  వివాదం పరిష్కారం కోసం గతనెల 29న సందీప్‌ ను పిలిపించారు.  కానీ మధ్యలో పండు  రావడంతో  సందీప్ కి అది నచ్చలేదు. ఈ క్రమంలో పండుకు వార్నింగ్‌ ఇస్తూ  సందీప్‌ ఫోన్‌ లోనే  అతనిని బెదిరించే యత్నం చేశాడు. సెటిల్‌మెంట్‌ కు నువ్వు ఎందుకొచ్చావంటూ నిలదీశాడు. పైగా 29న అర్థరాత్రి పండు ఇంటికెళ్లి సందీప్‌ బెదిరించాడు.
 
దాంతో ఆ మరసటి రోజు ఉదయం పండు అనుచరులు సందీప్‌ షాపుకు వెళ్లి..   షాపులో ఉన్న సందీప్‌ అనుచరుడిని పండు గ్యాంగ్‌ కొట్టింది. అల మొదలైన దాడి..   31వ తేదీ సాయంత్రం ఇరువర్గాలు కొట్టుకునేదాకా వెళ్లాయి.  అప్పటికే పోలీసులు వెళ్లేసరికి చాలామంది గాయపడి ఉన్నారు. మొత్తానికి సందీప్ ప్రాణాలే పోగొట్టుకున్నాడు.  విజయవాడలో ఇలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుండా  పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.