బురద రాజకీయమే టిడిపికి కావాల్సింది

తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడుకైనా క్రిందస్ధాయిలో ఉన్న నేతలకైనా కావాల్సింది బురద రాజకీయమే.  అంశం ఏదైనా కానీండి ప్రత్యర్ధులపై బురద చల్లేసి లేకపోతే మసిగుడ్డ వేసేసి తుడుచుకోమని చెప్పటం బాగా అలవాటైపోయింది. తాజాగా వరద పరిస్దితిలో చంద్రబాబు అండ్ కో  చేస్తున్న రాజకీయం కూడా అలాంటిదే.

కరకట్టపై నిర్మించిన అక్రమనిర్మాణాన్ని  చంద్రబాబు ఖాళీ చేసే ఉద్దేశ్యంలో లేరని అందరికీ అర్ధమైపోయింది. అక్రమనిర్మాణాన్ని కేంద్రంగా చేసుకుని వీలైనంతగా జగన్మోహన్ రెడ్డిని గబ్బుపట్టించాలన్నదే టిడిపి వ్యూహంగా కనబడుతోంది. దానికి అనుగుణంగానే చంద్రబాబు అయినా ఇతర నేతలైనా తమ మీడియా ద్వారా బురద చల్లుతున్నారు.

ఇక వరదల విషయానికి వస్తే ప్రభుత్వం ఎప్పటికప్పుడు వరద పరిస్ధితిని మానిటర్ చేస్తునే ఉంది. మంత్రులు, జిల్లాల కలెక్టర్లు ముంపు ప్రాంతాల్లో తిరుగుతునే ఉన్నారు. బాధితులను ముంపు ప్రాంతల నుండి ఖాళీ చేయిస్తునేఉన్నారు. ఇవన్నీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా రెగ్యులర్ గా జరిగేదే. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే వరద ప్రభావాన్ని అంచనా వేయటంలో ప్రభుత్వం విఫలమైందని ముద్రేయటమే చంద్రబాబుకు కావాల్సింది.

అందుకనే కరకట్ట మీద తన ఇంటిని ముంచేసేందుకు వేలాదిమంది జనాలను జగన్ ప్రభుత్వం ఇబ్బందులో పడేసిందని మండిపోతున్నారు. తన ఇంటిమీదకు వరద నీటిని వదిలేయటం ద్వారా వేల ఎకరాల్లో పంటలను ముంచేసిందట. ప్రకాశం బ్యారేజి తూములకు నాటు పడవలను అడ్డం పెట్టి నీటిని చంద్రబాబు ఇంటివైపు మళ్ళించిందని ఆరోపిస్తున్నారు. వరద ప్రాంతాల్లో మంత్రులు తిరగటం లేదని చెప్పటం నిజంగా అబద్ధమే.

నిజంగా చంద్రబాబు అండ్ కో చేసే ఆరోపణలు ఏవి కూడా జనాలు నమ్మే పరిస్ధితిలో లేరు. ఇలా చవకబారుగా మాట్లాడటం, అబద్ధాలు ప్రచారం చేయటం వల్లే చంద్రబాబు జనాల్లో నమ్మకం కోల్పోయి మొన్నటి ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నారు. అయినా టిడిపికి బుద్ధి రాలేదు. ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పి జగన్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెంచాలని చేస్తున్న ప్రయత్నాలు విచిత్రంగా ఉంది.