బీజేపీ రాం మాధవ్.. టీఆర్ఎస్ నెత్తి మీద పాలు పోసినట్లేనా ?

తెలంగాణలో అధికార టిఅర్ఎస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి గత నాలుగు సంవత్సరాలుగా స్నేహంగా ఉన్నాయి. అంటకాగిందిలేదు.. దూరంగా ఉన్నది లేకుండా ఈడు జోడు అన్నట్లుగా ప్రయాణం చేశాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపి కి గులాబి పార్టీ కి చెలిమి ఎందుకు చెడింది? ఈ వైరం ఇంకా కొనసాగితే భవిష్యత్తులో టిఅర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? వివరాలు చదవండి.

వరంగల్ జిల్లాలో కొనసాతున్న బీజేపి జన చైతన్య యాత్రలో పాల్గొన్న బీజేపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారమే రేపుతున్నాయి. బెల్లంపల్లి టిఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇటీవల కౌన్సిలర్ కూతురును బెదిరించిన వ్వవహరం పై రాం మాధవ్ రెచ్చిపోయి మాట్లాడారు. ‘టిఆర్ఎస్ వాళ్లకు మగతనం లేదు’ అంటూ ఘాటైన విమర్శలే చేసిండు రాంమాధవ్. అయితే బిజెపి నేత రాం మాధవ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఇంతకాలం తెలంగాణ బిజెపి నేతలైన డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి, మురళీధర్ రావులు సైతం వాడని భాషను రాం మాధవ్ వాడడం పట్ల అన్ని రాజకీయ పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అసలు రాం మాధవ్ తెలంగాణ బిజెపిని నిలబెట్టేందుకు ఈ కామెంట్ చేశారా? లేక బిజెపికి ఉన్న సీట్లు కూడా లేకుండా చేయడం కోసం చేశారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

రాం మాధవ్ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. దీంతో ఆయన తెలంగాణకు చెందిన టిఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్రమైన పదజాలంతో ధూషించడాన్ని తెలంగాణ బిజెపి నేతలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తెలంగాణలో ఏ చాన్స్ దొరికినా సద్వినియోగం చేసుకోవడంలో అందెవేసిన చేయిగా టిఆర్ఎస్ వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాం మాధవ్ మగతనం లాంటి పరుష పదజాలంతో దూషించడం చూస్తే తెలంగాణలో టిఆర్ఎస్ నెత్తిన రాం మాధవ్ పాలుపోశినట్లే అంటున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఈ పరిస్థితిని క్యాచ్ చేసుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు, బిజెపి నేతలు ప్రయత్నం చేసుకుంటున్న దశలో రాం మాధవ్ చేసిన చిన్న కామెంట్ తెలంగాణలో టిఆర్ఎస్ కు బూస్ట్ ఇచ్చినట్లే అని బిజెపిలోనూ చర్చ మొదలైంది. డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి లాంటి తెలంగాణ నేతల భాష ఏనాడైనా హుందాగానే ఉంటుంది. కానీ రాం మాధవ్ ఎత్తుగడ మరి బిజెపికి ఏ రకంగా బలాన్ని ఇస్తుందబ్బా అని అంతర్మథనం మొదలైంది.

తెలంగాణ పార్టీ పై ఇంకా ఆంధ్రా నేతల పెత్తనమా?
టిఆర్ఎస్ వాళ్లకు మగతనం లేదు అంటూ బీజేపి జన చైతన్య యాత్ర సభలో పాల్గొన్న బీజేపి ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం సృష్టించేలా ఉన్నాయని తెలంగాణ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే రాంమాధవ్ ఏపి కి చెందిన వ్యక్తి. తెలంగాణ బీజేపి నేతలు ఇంత దిగజారి ఏనాడూ మాట్లాడలేదు అంటున్నారు. రాం మాధవ్ చేసిన వ్యాఖ్యలకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందించారు. ‘మగతనం గురించి ఎలక్షన్స్ లో మాపార్టీ పై పోటీ చేసిన మీ అభ్యర్థులని అడగండి..రానున్న ఎలక్షన్స్ లో మళ్ళీ మగాడు ఎవడో మొనగాడు ఎవడో ప్రజలు చెప్తారు’ అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు.