కారు వర్సెస్ కమలం: ఈ యుద్ధం ఎప్పటిదాకా.?

తెలంగాణ రాష్ట్ర సమితికీ, భారతీయ జనతా పార్టీకీ మధ్య ‘వరి’ యుద్ధం జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీయార్ స్వయంగా ఈ యుద్ధానికి నాయకత్వం వహిస్తున్నారు.. ముందుండి నడిపిస్తున్నారు. సాధారణంగా అయితే, బీజేపీ మీద విమర్శలకు పార్టీ ముఖ్య నేతల్ని పురమాయించి ఊరుకునేవారు కేసీయార్. కానీ, ఇప్పుడు సీన్ మారింది.

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిథులతో కలిసి మహా ధర్నా చేయనున్నట్లు కేసీయార్ తాజాగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనమైంది. అధికారంలో వున్న పార్టీ, ఇలా రోడ్డెక్కి ఆందోళనలు చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది.

తెలంగాణలో బీజేపీకి వున్న సీన్ చాలా తక్కువ. కానీ, గత కొంతకాలంగా బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటోంది. అదే కేసీయార్ ఒకింత కంగారు పడటానికి కారణం. బీజేపీ బలపడకూడదనే ఆలోచనో.. లేదంటే, బీజేపీకి ఇంకాస్త అదనపు పబ్లిసిటీ ఇవ్వాలన్న ఆలోచనో.. కారణం ఏదైతేనేం, తెలంగాణలో రెండే రెండు ప్రధాన పార్టీలు.. అందులో ఒకటి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అయితే ఇంకోటి బీజేపీ.. అనేలా ఇటీవలి కాలంలో ప్రొజెక్షన్ జరుగుతోంది.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ధీటుగా తెలంగాణ వరి ఉద్యమాన్ని కేంద్రంపైకి సంధిస్తున్నారు కేసీయార్. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ కావొచ్చు, తెలంగాణలోని ఇతర ప్రధాన పార్టీలు కావొచ్చు.. పూర్తిగా గల్లంతైపోయాయి.

హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత అనూహ్యంగా కేసీయార్‌లో వచ్చిన ఈ మార్పు.. తెలంగాణ రాజకీయాల్ని ఎటువైపు తీసుకెళుతుందోగానీ, బీజేపీ అగ్రనాయకత్వం ఇంకాస్త స్పెషల్ ఫోకస్ తెలంగాణ మీద పెడితే.. తెలంగాణలో ఆ పార్టీ అధికారం దిశగా దూసుకెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు.