దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వున్న వైఎస్సార్సీపీని టార్గెట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంటో వైఎస్ జగన్ సర్కార్, తమ రంగులు వేసుకుంటోందంటూ ఎద్దేవా చేసేశారు రఘునందన్.
దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్, అధికార పార్టీని ఢీకొట్టి బంపర్ విక్టరీ కొట్టిన మాట వాస్తవం. ఆ సమయంలో ఆయన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పెను దుమారమే చెలరేగింది. అయితే, తన వ్యాఖ్యల పట్ల ఆయన అప్పట్లో విచారం వ్యక్తం చేశారనుకోండి. అది వేరే వ్యవహారం.
అసలు విషయానికొస్తే, తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఆంధ్రప్రదేశ్లో బద్వేలు ఉప ఎన్నిక జరుగుతున్నాయి. తెలంగాణలో బీజేపీ, గట్టి పోటీ ఇస్తోంది అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి. అయితే, ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదు.
దుబ్బాకలో సత్తా చాటినా, నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ చతికిలపడింది. అయితే, హుజూరాబాద్ విషయంలో మాత్రం బీజేపీ కాస్త పట్టుదలతోనే వున్నట్లు కనిపిస్తోంది. అయినాగానీ, తెలంగాణ బీజేపీ నేతలకి, ఏపీ రాజకీయాలతో ఏం పని.?
వైసీపీ ప్రభుత్వం, కేంద్రం నిధులు ఇస్తోంటే వైసీపీ రంగులేసుకుంటోందన్నదే నిజమని అనుకుందాం. మరి, కేంద్రానికి డబ్బులెక్కడివి.? కేంద్రంలో అయినా, రాష్ట్రంలో అయినా ప్రజలు పన్నులు కడితేనే ఖజానాలు నిండుతాయి. ‘మోడీ వ్యాక్సిన్..’ అని బీజేపీ ప్రచారం చేసుకుంటున్నప్పుడు, ఏపీలో సంక్షేమ పథకాలకు వైసీపీ రంగులేసుకోవడం తప్పెలా అవుతుంది.?