పాదయాత్ర చేసి వైఎస్సార్ సీఎం అవ్వడం, ఆ తరువాత జగన్ కూడా సేమ్ అలాగే పాదయాత్ర చేసి, ఏకంగా రికార్డ్ స్థాయిలో గెలవడంతో.. మొత్తానికి పాదయాత్రకి ఫుల్ డిమాండ్ వచ్చేసింది. నిజానికి జాతిపిత గాంధీ మనకు స్వాతంత్య్రం తేవడానికి మొదలుపెట్టిన ఈ పాదయాత్రను, నేడు రాజకీయ నాయకుల స్వార్ధ రాజకీయాలకు ఆయుధంగా మలుచుకుంటున్నారు. ప్రజలకు చేరువ చేసే పాదయాత్ర ప్రతి నాయకుడికి విజయమే చేకురుస్తూ వస్తోంది. 2003 లో దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేయకముందు ఆయనకు పెద్దగా ఫాలోయింగ్ లేదు. కానీ పాదయాత్ర తరువాత ఆయన రేంజ్ మారిపోయింది.
ఇక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు కూడా అదే స్పూర్తితో 2013లో పాదయాత్ర చేసి.. ఫలితంగా 2014లో టీడీపీ కూటమితో విజయబావుటా ఎగరవేశాడు. ఆ తరువాత మొదటిసారి ఎన్నికలలో తృటిలో ఓటమి చవిచూసిన వై ఎస్ జగన్ సుదీర్ఘ పాద యాత్ర చేసి 2019 ఎన్నికలలో భారీ విజయాన్ని అందుకున్నారంటే.. ఏకైకమైన కారణం పాదయాత్ర ఒక్కటే. అందుకే ఇప్పుడు పాదయాత్రకు ఫుల్ డిమాండ్ ఉంది. బీజేపీ సారథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుదీర్ఘ పాదయాత్ర చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి గాని, పవన్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారట. కాబట్టి పాదయాత్రను ఎన్నికలకు ముందే ఉండే అవకాశం కలదు.
ఇక ఈ పాదయాత్ర రేసులో ఉన్న మరో నాయకుడు లోకేష్ బాబు. చంద్రబాబు నేతృత్వంలో లోకేష్ బాబు పాదయాత్ర చేయడం ఖాయం అన్న మాట గట్టిగా వినిపిస్తున్నా.. ఇది పాదయాత్రగా కొనసాగుతుందో.. లేక నడిచే కామెడీ షో అవుతుందో అని డౌట్ వస్తోంది. ఏమైనా చిన్నబాబు ట్వీట్స్ తో బెంబేలెత్తిస్తున్నారు. పవన్, లోకేష్ ఇద్దరూ పాదయాత్ర పై పట్టు సాధించే తరుణంలో ఈ పాదయాత్ర సెంటిమెంట్ ఎవరికి వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.