పవర్‌స్టార్ మాస్ స్వాగ్.. ఓజీ సినిమాలో హైలెట్ అదేనంట.. ఫ్యాన్స్ కి పూనకాలే..!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలంటే అభిమానులకు ఎప్పుడూ అభిమానుల్లో క్రేజ్ ఉంటుంది. హరిహర వీరమల్లు కొంత నిరాశ కలిగించిన తర్వాత, ఈ సారి ఓజీ రూపంలో పవన్ తెరపైకి వచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్స్, టీజర్స్‌తో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రీమియర్స్‌తోనే టాక్ బయటకు రావడంతో ఫ్యాన్స్ థియేటర్లను పండగ వాతావరణంగా మార్చేశారు.

కథ విషయానికొస్తే, జపాన్‌లో జరిగిన ఒక దాడి నుంచి తప్పించుకుని ఇండియాకు బయలుదేరే ఓజస్ గంభీర అలియాస్ ఓజీ (పవన్ కళ్యాణ్), ఆ ప్రయాణంలో సత్యదాదా (ప్రకాశ్ రాజ్)ను రక్షించడం, అతడి కుడిభుజంగా మారడం, ముంబై అండర్‌వర్ల్డ్‌లో దూసుకుపోవడం ప్రధానమైన లైన్. కానీ ఓ అనుకోని సంఘటన కారణంగా ఓజీ ఆ కుటుంబానికి దూరమవుతాడు. తర్వాత డాక్టర్ కన్మణి (ప్రియాంక మోహన్)ను వివాహం చేసుకుని కొత్త జీవితం మొదలుపెడతాడు. ఇదే సమయంలో సత్యదాదా శత్రువులు మళ్లీ బలపడటంతో ఓజీ తిరిగి రంగంలోకి దిగడం కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

డైరెక్టర్ సుజీత్ ఈ కథను కొత్తదనంతో కాకపోయినా పవన్ లుక్, స్టైల్, మాస్ ఎలిమెంట్స్‌కి సరిపడేలా మలిచాడు. జపాన్ సన్నివేశాలతో ప్రారంభమైన కథ, ముంబై మాఫియా వరల్డ్ వైపు మలుపు తిరగడం ప్రేక్షకులను ఎంగేజ్ చేసింది. పవన్ భార్య, కూతురుతో ఉన్న సన్నివేశాలు ఎమోషనల్ కనెక్ట్ కలిగించగా, హార్బర్ యాక్షన్ ఎపిసోడ్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా తీర్చిదిద్దబడ్డాయి.

పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో తన అసలైన మాస్ స్వాగ్‌ను తిరిగి చూపించారు. లుక్, యాక్షన్, డైలాగ్స్ అన్నీ ఫ్యాన్స్‌ని మంత్ర ముగ్ధుల్ని చేశాయి. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా బలమైన ఇంపాక్ట్ చూపించగా, ప్రకాశ్ రాజ్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఇచ్చారు. హీరోయిన్ ప్రియాంక మోహన్ తన పాత్రలో సహజంగా నటించింది. ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.