ప్రభుత్వ జాబితా కెక్కక పోతే అమరవీరుడు కాడా?

కరీంనగర్ జిల్లా విణవంక మండలం అచ్చం పల్లి గ్రామంలో నిర్మాణం అవుతున్న అలుగువెళ్లి రవీందర్ రెడ్డి స్థూపాన్ని పోలీస్ లు కూల్చివేశారు. 2001 సం, లో అలుగువెళ్లి రవీందర్ రెడ్డి ని  ఈ ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ రాజకీయ నేత అనుచరులు కిరాతకంగా హత్యచేశారు. అప్పటికే అలుగువెళ్లి రవీందర్ రెడ్డి తెలంగాణ జనసభ మండల కన్వీనర్ గా గ్రామ ,గ్రామాన తెలంగాణ వాదాన్ని వినిపించాడు. కలవాల ప్రాజెక్టు సాధన కోసం రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహించి, 30 రోజులు దీక్ష శిబిరం నిర్వహించి ,ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వ స్పందన వచ్చేదాకా పోరాటం ఆపమని తేల్చి చెప్పడంతో అప్పటి ఒక  మంత్రి  అనుచరులు అర్ధరాత్రి దీక్ష శిబిరంపై దాడి చేసి సామగ్రి,టెంటును కాల్చివేశారని విమర్శలున్నాయి. చివరకు ఆ పోరాటం ఫలించి ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. కానీ రాజీలేని పోరాటం చేసిన  అలుగువెళ్లి రవీందర్ రెడ్డిని ఇలాంటి ఉద్యమాలు గిట్టని శక్తులు  హత్య చేసాయి. ఆయన స్మృతి చిహ్నంగా అభిమానులు ఒక స్థూపం నిర్మించాలనుకున్నారు.

విణ వంక మండల ప్రజలకు, తెలంగాణ వాదులకు, తెలంగాణ ఉద్యమ నాయకునిగా సూపరిచితమైన అలుగువెళ్లి రవీందర్ రెడ్డి పేరు అమరుల జాబితాలో లేదు.కనుక స్థూపం కట్టడానికి అనుమతి లేదంటున్నారు .గ్రామ పంచాయతీ అనుమతి పత్రాలు చూపినప్పటికి అలుగువెళ్లి రవీందర్ రెడ్డి తమ్ముడు మల్లారెడ్డి,తండ్రి రాజిరెడ్డి ని, మెస్త్రీలను అక్రమంగా అరెస్టు చేశారు.సిమెంట్ బస్తాలు,ఇతర సామాగ్రి ని పోలీస్ లు తీసుకెళ్లారు. తీసుకెళ్లిన స్థూప సామాగ్రితో అమెస్త్రీలతోనే పోలీస్ స్టేషన్ల గోడలను ప్లాస్టింగ్ చేయించారు.

తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక చర్యలను టిపి ఎప్ తీవ్రంగా ఖండించింది. అచ్చం పల్లి గ్రామంలో స్థూపం కూల్చిన చోటనే తిరిగి ప్రభుత్వ ఖర్చులతో నిర్మాణం చేయాలని ఈ సంస్థ  డిమాండ్  చేసింది.  గ్రామ పంచాయతీ అనుమతి ఉన్నసరే చట్ట విరుద్ధంగా అతి ఉత్సహం తో స్థూపం కూల్చి వేసిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని  ఈ ఘటనకు స్థానిక మంత్రి ఈటల రాజేందర్ నైతిక బాధ్యత వహించి ,స్థూపo పున నిర్మాణానికి ఆటంకాలు కలిగించకుండా ఉండాలనిఈ సంస్థ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఆకుల భూమయ్య ,కనకాచరీ, మద్దిలేటి, బెల్లిలలిత,రవీందర్ రెడ్డి,ఐలన్న వంటి మొదలైన అమరుల స్థూపాలను నిర్మించడానికి అడ్డుతగిలారు నేటికి ప్రభుత్వం ఆటంకం కలిగిస్తుంది.పోరాడి సాధించుకున్న తెలంగాణ లో తెలంగాణ ఉద్యమ నాయకులను స్మరించుకునే హక్కులేదా అని టిపిఎఫ్  ప్రశ్నించింది.  స్థూపాల కూల్చివేతను ప్రజలు,ప్రజాస్వామిక వాదులు ఖండించాలని కోరింది.