చేతులారా అమరావతిని శిధిలం చేసిన చంద్రబాబు

The Amravati movement was confined to a few villages.
టైటిల్లో తప్పేమీ లేదు. ఇవాళ అమరావతి ఈ స్థితికి రావడానికి, రైతులు రోడ్లపక్కన కూర్చుని టెంట్లు వేసుకుని అల్లరిపాలు కావడానికి కారకులు ముమ్మాటికీ చంద్రబాబే. అక్కడ జరిగేది అసలు సిసలైన రైతుల ఉద్యమం కాదని, అది కేవలం కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆడించే డ్రామా మాత్రమే అని గత ఏడాదిగా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.  అసలు అది ఉద్యమమే అయితే ఇంత పేలవంగా తూతూమంత్రంగా జరుగుతుందా? ఉద్యమం అంటే ఎలా జరుగుతుందో గత పదిహేను రోజులుగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని చూడాలి. సరే…ఆ రైతుల ఉద్యమం సఫలం అవుతుందా లేదా అనేది వేరే విషయం. కానీ, లక్షలాదిమంది రైతులు గడ్డకట్టే చలిలో రాత్రి పవలు భేదం లేకుండా రోడ్లమీదే నిద్రిస్తూ మహోధృతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అయిదారు సార్లు కేంద్ర ప్రభుత్వం  వారితో చర్చలు కూడా జరిపింది.  ఇంకా జరుగుతాయి.  సుప్రీమ్ కోర్ట్ కూడా రైతుల ఉద్యమ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేసింది.  మొత్తానికి దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమం చర్చనీయాంశం అయింది.  
 
The Amravati movement was confined to a few villages.
The Amravati movement was confined to a few villages.
ఇక తెలంగాణ ఉద్యమం గూర్చి చెప్పాల్సిన పనే లేదు.  చాలాకాలంగా మూడు నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితమైన తెలంగాణ భావనను మహోద్యమంగా మార్చి ప్రాంతంలోని పది జిల్లాలకు విస్తరింపజేసిన ఘనత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ ది.  ఆయన సారధ్యంలో ఏమాత్రం జోరు తగ్గకుండా నాలుగు కోట్లమందిని ఏకం చేసి చివరకు రాష్ట్రాన్ని సాధించడం జరిగింది.  
 
మరి అమరావతి ఉద్యమం ఎలా జరుగుతున్నది?  అది కేవలం ఓ పాతిక గ్రామాలకు మాత్రమే పరిమితమైంది.  మొక్కుబడిగా కూర్చోవడం, అటువైపు ప్రభుత్వ వాహనాలు వెళ్తుంటే కేకలు పెట్టడం, సాయంకాలానికి విశ్రమించడం.  అంతేగా?  నిజంగా అది ఒక ఉద్యమం అయితే రాష్ట్రం మొత్తం కదలాలి.  అన్ని జిల్లాలు సంఘీభావం తెలపాలి.  ప్రతి జిల్లానుంచి ప్రజలు తరలి రావాలి.  ఊరూవాడా ఏకం కావాలి.  నిరాహారదీక్షలు, ధర్నాలు, ఆందోళనలు మహోధృతంగా సాగాలి.  ఏవీ?  ఆ పది గ్రామాలలో తప్ప మరెక్కడైనా అమరావతి అనే శబ్దం వినిపిస్తున్నదా?  అసలు అమరావతిని రాజధానిగా ఎవరు అంగీకరించారు?  ఒక్క చంద్రబాబు నిర్ణయిస్తే సరిపోతుందా?  అమరావతి నిర్ణయానికి ప్రజామోదం లేదు.  పోనీ, ఆ రెండు జిల్లాలలో అయినా ఉద్యమం పెద్దఎత్తున సాగుతున్నదా?  సమీపంలోని గుంటూరు, మంగళగిరి,  తెనాలి లాంటి ప్రాంతాల్లో అసలు అమరావతి అన్న పేరే వినిపించదు.  
 
కారణం ఏమిటి?  చంద్రబాబు అనుసరించిన దుర్మార్గపు విధానం.  అమరావతి రైతులనుంచి భూములను స్వచ్ఛందంగా సేకరించలేదని, అనేకమందిని బెదిరింపులకు గురి చేశారని, లాండ్ పూలింగ్ విషయంలో తన కులస్తులకు ఒక విధంగా, వేరే కులస్తులకు మరొకవిధంగా రూల్స్ ను మార్చారని చంద్రబాబు కాలం నుంచే విమర్శలు వినిపించాయి.  ఇక అమరావతి పేరుతో అనేకమంది చంద్రబాబు కులస్తులు వందల ఎకరాల భూములను కొనుగోలు చేశారని,  కారు చౌకగా రైతులనుంచి కొనేసి, ఆ డబ్బుతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భూములు కొని, సొంత గ్రామాల్లో భవంతులు, విలాసవంతమైన కార్లు కొనుగోలు చేశారని అప్పటి పత్రికల్లో వార్తలు వచ్చాయి.  ఎక్కడో విదేశాల్లో నివసించే తెలుగుదేశం అభిమానులు సైతం అమరావతికి పరిగెత్తుకుంటూ వచ్చి భూములను కొనుగోలు చేశారని, ఇప్పుడు వారే బాధితులుగా మిగిలారని, అసలు రైతులు తమకు అందుతున్న కౌలు డబ్బు, ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం స్థలాన్ని పొందారని చెబుతారు.  
 
ఇక అమరావతి భూముల కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతి జరిగిందని, సాక్షాత్తూ హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి కుటుంబ సభ్యులు, అనేకమంది సినిమా నటులు, నిర్మాతలు, దర్శకులు, పత్రికాధిపతులు, వ్యాపారవేత్తలు కూడా అమరావతిలో భూములు చౌకగా కొన్నారని అవినీతి నిరోధకశాఖ ఇటీవలే వివరాలను బయటపెట్టింది.  అమరావతి అనేది కేవలం కమ్మరావతి అనే పేరు రావడానికి కేవలం చంద్రబాబు మాత్రమే కారకులు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.  అందుకే రైతుల ఉద్యమం పెయిడ్ ఉద్యమం అనే చెడ్డపేరు వచ్చేసింది.   రైతుల పేరుతో మరో నాలుగేళ్లు డ్రామాలు ప్రదర్శించినా ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన ఉండకపోవచ్చు.  అలా కాక అమరావతి ఒక్కటే రాజధాని అని ముందుకు వెళ్తే, రాయలసీమ, ఉత్తరాంధ్రలో వేర్పాటు ఉద్యమాలు తలెత్తవచ్చు.  కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల విధానమే సర్వోత్తమం. అన్ని జిల్లాలను సమాంతరంగా  అభివృద్ధి చెయ్యాలి.  అప్పుడే ఆంధ్రప్రదేశ్ పురోగమనదిశలో  పయనిస్తుంది.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు