తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య మరణించారు. తెల్లవారుజామున గుండెనొప్పి రావటంతోనే మృతిచెందినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. తెల్లవారుజామున అస్వస్ధతకు గురైన బ్రహ్మయ్యను కడప నుండి హైదరాబాద్ తరలించేందుకు ప్రయత్నించారు. అయితే గుండెపోటు తీవ్రంగా రావటంతో మధ్యలోనే చనిపోయారు.
ఈ ఫిబ్రవరిలో కూడా బ్రహ్మయ్యకు ఓసారి గుండెపోటు వచ్చింది. దానికితోడు రాజకీయంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు సమాచారం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట నుండి టికెట్ ఆశించి భంగపడ్డారు. 1994, 1999లో రెండుసార్లు రాజంపేట నుండే ఎంఎల్ఏగా బ్రహ్మయ్య ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే ఒకసారి మంత్రిగా కూడా చేశారు.
మొత్తానికి బ్రహ్మయ్య మరణించటం టిడిపికి లోటనే చెప్పాలి. జిల్లాలోని సీనియర్ నేతల్లో ఒకరైన బ్రహ్మయ్య చాలా కాలంగా పార్టీలోనే ఉన్నారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పార్టీలోనే కంటిన్యు అవుతున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత టిడిపి భవిష్యత్తుపై చాలామంది లాగే బ్రహ్మయ్య కూడా ఆందోళనలో పడ్డారు. పార్టీ మారాలని మద్దతుదారులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై నిర్ణయం తీసుకునేలోగానే ఘొరం జరిగిపోయింది.