వైసిపి ఛాయ నుండి బయటపడేందుకే రాష్ట్రంలో బిజెపి నేతలు జగన్మోహన్ రెడ్డిని డైరెక్టుగా ఎటాక్ చేస్తున్నారు. విషయం చిన్నదైనా, పెద్దదైనా సరే బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చాలా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. సరే జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయాలనే తొందరలో కొన్ని తప్పులు కూడా చేస్తున్నారు లేండి. ఏదేమైనా జగన్ పై విరుచుకుపడటంలో చంద్రబాబునాయుడుతో కన్నా పోటి పడుతున్నారు.
చాలామందికి అర్ధం కాని విషయం ఏమిటంటే చంద్రబాబు అంటే జగన్ పై ఆరోపణలు, విమర్శలతో మండిపోతున్నారంటే అర్ధముంది ? మరి ఏమి ఆశించి కన్నా కూడా జగన్ పై అదే స్ధాయిలో ఎగిరెగిరి పడుతున్నారు ? జగన్ పై ఎన్ని ఆరోపణలు చేసినా బిజెపి నాలుగు సీట్లలో గెలిచేంత సీన్ లేదు. అయినా సరే కన్నా స్పీడు వెనుక ఓ కారణం ఉందని తెలుస్తోంది.
ఇంతకీ అదేమిటంటే వైసిపి ఛాయలో నుండి బయటపడేందుకు బిజెపి నేతలు జగన్ ను అంతలా ఆరోపణలు, విమర్శలతో దాడులు చేస్తున్నారట. చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నంత కాలం బిజెపిని టిడిపికి తోకపార్టీ అనే ముద్ర పడిపోయింది. చంద్రబాబు ఓడిపోయి వైసిపి అధికారంలోకి రాగానే బిజెపిని వైసిపికి తోకపార్టీగా చెప్పుకుంటున్నారట.
దానికి కారణం ఏమిటంటే వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కొంతకాలంగా ఢిల్లీ స్ధాయిలో బిజెపి అగ్ర నేతల దగ్గర బాగా హడావుడిగా ఉండటమేనట. ప్రధానితో పాటు కేంద్రమంత్రులను విజయసాయి రెగ్యులర్ గా కలుస్తుండటంతో వైసిపి చెప్పినట్లే బిజెపి అగ్ర నేతలు వింటున్నారు అనే ప్రచారం రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతోందట.
ఇదే విషయం బిజెపి నేతల సమావేశాల్లో కూడా ప్రముఖంగా ప్రస్తావనకు వస్తోంది. దాంతో తమ పరిస్ధితిని రాష్ట్ర నేతలు కేంద్ర నాయకత్వానికి విడమరచి చెప్పారట. దాంతో కేంద్ర నాయకత్వం సూచనల మేరకే కేంద్రమంత్రి షెకావత్ తో పాటు రాష్ట్ర నేతలు కూడా జగన్ ను టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం.