చంద్రబాబునాయుడు ప్రతి రోజు చెబుతున్న ప్రజాస్వామ్యం టిడిపిలో ఇలాగే ఉంటుంది. పై ఫొటోల్లో టిడిపి నేతల వ్యవహారం చూస్తుంటే ప్రజాస్వామ్యం అంటే ఏమిటో అందరికీ అర్ధమవుతోంది. చలో ఆత్మకూరులో భాగంగా టిడిపి శిబిరం దగ్గరకు వెళ్ళటానికి పై ఇద్దరు మాజీ మంత్రులు ప్రయత్నాలు చేశారు. వాళ్ళ ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.
ఎప్పుడైతే పోలీసులు తమను అడ్డగించారో వాళ్ళపై నోటికొచ్చినట్లు విరుచుకుపడిపోయారు. అచ్చెన్నాయుడు అయితే ఎస్పిని పట్టుకుని తన క్రిందిస్ధాయి అధికారులు అందరి ముందు ’యూజ్ లెస్ ఫెలో’ అంటూ నోటికొచ్చినట్లు తిట్టారు. తనను అడ్డగించే అధికారం, హక్కు పోలీసులకు ఎక్కడిది అంటూ లా పాయింట్లు లేవదీశారు. పెద్ద ఎత్తున రోడ్డుపైనే వారితో వాగ్వాదానికి దిగారు. సరే మొత్తానికి అచ్చెన్న ఎంత వాదించినా పప్పులుడకలేదు లేండి.
ఇక ఓ హోటల్లో బస చేసిన భూమా అఖిలప్రియ అయితే తనను అడ్డగించిన పోలీసులను నోటికొచ్చినట్లు మాట్లాడారు. తనతో మాట్లాడేటపుడు ముందు తానెవరో తెలుసుకుని మాట్లాడమని వార్నింగ్ ఇవ్వటం విచిత్రంగా ఉంది. తనను అడ్డగించే అధికారం లేదంటూ పోలీసులను నోటికొచ్చినట్లు మాట్లాడారు. తనతో మాట్లాడేందుకు వచ్చిన మహిళా ఎస్సైకి వార్నింగ్ ఇవ్వటం కలకలం రేపింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వీళ్ళు మంత్రులుగా ఉన్న కాలంలో వైసిపి ఎంఎల్ఏలు, నేతల విషయంలో పోలీసులు ఇదే విధంగా ప్రవర్తించారు. అప్పట్లో ప్రతిపక్షం నేతలను అరెస్టులు చేస్తే అప్పుడేమో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అంటూ ప్రభుత్వ చర్యలను సమర్ధించుకున్నారు.
అదే పోలీసులు ఇపుడు తమను హౌస్ అరెస్టులు చేస్తుంటే పోలీసులందరూ వైసిపి తొత్తులుగా మారిపోయారంటూ విరుచుకుపడుతున్నారు. అంటే వీళ్ళ లెక్కేమిటంటే తాము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పోలీసులైనా ప్రభుత్వ యంత్రాంగమైనా మొత్తం తాము చెప్పినట్లే నడుచుకోవాలన్నట్లుంది. మొత్తానికి చంద్రబాబు చెప్పే ప్రజాస్వామ్యం టిడిపిలో బ్రహ్మాండంగా వర్ధిల్లుతోందనే చెప్పాలి.