కరోనా భయంతో ఇళ్లలోనే బిక్కు బిక్కుమంటూ బతుకుతున్న జనానికి తెలంగాణ ప్రభుత్వం ఓ శుభ వార్త తెలియజేసింది. కానీ ఈ శుభ వార్తనే ఇప్పుడు కొంతమందిని ఆందోళనలో పడేస్తోంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రంలో బస్సుల రవాణా గురించి విస్తృతంగా చర్చలు జరిపి రేపటినుండి యథేచ్ఛగా బస్సులను నడపాలని నిర్ణయించుకున్నారు. ఇన్నాళ్లుగా అన్నిపనులను మానుకొని కరోనా నుండి రక్షణ పొందిన జనానికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లాభమా ? నష్టమా ?
హైదరాబద్ ఆర్టీసీ బస్సుల రద్దీ గురించి కేసిఆర్ కి తెలియదా ? ఎప్పుడూ కిక్కిరిసిన జనంతో ఉగిసిలాడే బస్సులు ఒక్కసారిగా రోడ్ల మీదకు వస్తే.. ప్రజలు కూడా మొత్తం బస్సుల్లో ప్రయాణాలు చేస్తే.. పరిస్థితి ఏమిటి ? కరోనాని ఆపగలమా ? ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం జరిపి ఇలాంటి నిర్ణయాన్ని కేసీఆర్ ఎలా తీసుకున్నారో..? బస్సులను పరిమితులకు తగ్గట్లుగానే నడుపుతాం అని కేసీఆర్ చెప్పినా అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే భయం ప్రజల్లో కనిపిస్తోన్న మాట వాస్తవం.
ఇప్పటికే కేంద్రప్రభుత్వం ఈ నెలాఖరుకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది అయితే తుది నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేసింది. దీంతో కేసీఆర్ మంత్రిమండలి రేపటినుండి బస్సులను నడపాలని నిర్ణయించింది. గతంలో ఆర్టీసీని 50 శాతం నడపవలసిందిగా కొంతమంది కోరినా పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా బస్సులను నడపడానికి తెలంగాణా ప్రభుత్వం నిరాకరించింది.
మరి ఇప్పుడు కూడా హైదరాబద్ లో కేసులు పెరుగుతున్నాయి కదా, బస్సులు నడపడానికి సుముఖత ఎందుకు వ్యక్తం చేసినట్లు..? హైదరాబద్ లో పెరుగుతున్న కేసుల పై ప్రభుత్వం ఏం చేస్తోందో చూడాలి. కరోనా ఎటునుండి ఎలా వస్తుందో అని లోలోపల భయపడుతున్నారు జనం.