కిషన్-వంశీ భేటీతో చంద్రబాబులో టెన్షన్

చంద్రబాబునాయుడులో టెన్షన్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఏరోజు ఏ ఎంఎల్ఏ ఏ నేత టిడిపికి రాజీనామా చేస్తారో అర్ధం కావటం లేదు. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డితో గన్నవరం టిడిపి ఎంఎల్ఏ వల్లభనేని వంశీమోహన్  భేటీ అయ్యారు.  ఈ విషయం బయటకు పొక్కటంతో పార్టీలో కలకలం రేగింది.

మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. పార్టీకి భవిష్యత్ ఉండదని, చంద్రబాబు నాయకత్వంపై అనుమానంతో మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపిలు, ధర్మవరం మాజీ ఎంఎల్ఏల వరదాపురం సూరి బిజెపిలో చేరిపోయారు. అదే దారిలో ఇంకా చాలామందున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బిజెపిలోకి ఫిరాయించిన ఎంపిల్లో సుజనా చౌదరి టిడిపి ఎంఎల్ఏలకు వల వేస్తున్నారట. వంశీతో కూడా సుజనానే బిజెపిలోకి వచ్చేట్లుగా మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమధ్య కూడా ఇదే ప్రచారం జరిగినా తాను టిడిపిలోనే ఉంటానని వంశీ చెప్పారు.

అయితే తాజాగా కిషన్ తో వంశీ భేటీ అవటం పార్టీలో సంచలనంగా మారింది. ఆ విషయం తెలిసినప్పటి నుండి చంద్రబాబులో కూడా టెన్షన్ పెరిగిపోతోంది. మొన్నటి చిలకలూరిపేట చంద్రబాబు పర్యటనలో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు అడ్రస్ లేరు. తాజాగా కిషన్ తో వంశీ భేటీ విషయం టిడిపిలో హాట్ టాపిక్ అయిపోయింది. తాజా భేటీ విషయంలో వంశీ నోరిప్పక పోవటంతో అందరిలోను అనుమానాలు పెరిగిపోతోంది.