ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఆ పెద్ద తప్పిదం.!

దాన్ని తప్పిదం అనాలా.? ఘోర తప్పిదం అనాలా.? ఆనాటి ఆ ఘటన గురించి వైసీపీలో తరచూ చర్చ జరుగుతుంటుంది. అధికారంలోకి వస్తూనే, అసెంబ్లీలో బంపర్ మెజార్టీ దక్కించుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తిరుగులేని మెజార్టీని రాష్ట్ర ప్రజలు వైసీపీకి కట్టబెట్టారు.

అసెంబ్లీలో బలం వుంది.. కానీ, అప్పట్లో శాసన మండలిలో తగినంత బలం లేదు. చంద్రబాబు చేసిన రాజకీయమే వైఎస్ జగన్ కూడా చేసి వుంటే, అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్ళలోనే శాసన మండలి మొత్తం వైసీపీ కనుసన్నల్లోకి వచ్చేసి వుండేది. కానీ, అలా చేయలేదు వైఎస్ జగన్.

వైసీపీలోకి కొందరు ఎమ్మెల్యేలు దూకేశారు టీడీపీ నుంచి, జనసేన నుంచి. కొందరు ఎమ్మెల్సీలు కూడా వైసీపీలోకి దూకేశారు. అయినాగానీ, సరిపడా సంఖ్యలో ఎమ్మెల్సీలను లాగేయడంలో వైసీపీ విఫలమైంది. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి సీనియర్లు, ఎమ్మెల్సీలను లాగేద్దామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సూచించినా, ఆయన వినలేదంటారు.

ఒకవేళ అలా లాగేసి వుంటే, మూడు రాజధానుల బిల్లుకి శాసన మండలిలో ఎలాంటి ఇబ్బందీ వుండేది కాదు.! అలా అప్పుడొచ్చిన ఆ ఇబ్బంది అలా అలా కొనసాగుతూ వచ్చింది. కోర్టుల్లో కేసులు తదితర వ్యవహారాలకు సంబంధించి, శాసన మండలిలో గందరగోళం కూడా కొంత అడ్డంకిగా మారిన విషయం విదితమే.

ఇప్పుడు సుప్రీంకోర్టుని వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని లేదా రాజధానుల విషయంలో ఆశ్రయించి ప్రయోజనమేముంది.? మూడేళ్ళ పాలన పూర్తయిపోయింది. ఆ మాటకొస్తే, మూడున్నరేళ్ళయిపోతోంది కూడా. మిగిలింది ఏడాదిన్నర కాలమే గట్టిగా.!

2024 ఏప్రిల్ – మే నెలల్లో సాధారణ ఎన్నికలు జరుగుతాయ్. అంటే, 2023 చివరి వరకే ప్రభుత్వం ఏదైనా గట్టిగా చేయగలుగుతుంది. అంటే, గట్టిగా ఏడాది సమయం వుందంతే. కోర్టు కేసులు అంత తేలిగ్గా ఓ కొలిక్కి రావు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చే పరిస్థితి వుంటే, దానికి కౌంటర్ ఖచ్చితంగా అమరావతి రైతుల నుంచి పడుతుంది. ఇవన్నీ ఎప్పటికి తేలాలి.? ఆ రోజు ఆ ఒక్క తప్పిదం చేయకుండా వుండి వుంటే.. మూడు రాజధానులు అమల్లోకి వచ్చేసేవేమో.!