ఎత్తుకు పై ఎత్తుల్లో తెలుగు దేశం చిత్తు

ChandraBabu Dangeorus plan On YS Jagan

చంద్రబాబు నాయుడు ప్రాపకం ఏ మాత్రం లేకుండా తుడిచి పెట్టే ఎత్తులో మూడు రాజధానుల ప్రతిపాదన ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చారు. అయితే రాజధాని రైతుల ఆందోళన దానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి తనను ఇరకాటంలో పెడతారని ముఖ్యమంత్రి ఊహించలేదు. ఈ అంశంలో వైసిపి ఒంటరిదైంది. పైగా శాసన మండలి పరిణామాలు కూడా ఈ స్వరూపం తీసుకొంటాయని కూడా ముఖ్యమంత్రి భావించలేదు. టిడిపి ఎమ్మెల్సీలు బుట్టలో పడతారని భావించారు మొత్తం మీద ముఖ్యమంత్రి పథకం చిక్కుల్లో పడింది. పైగా అక్రమాస్తుల కేసు గుదిబండగా తయారైంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పియస్ ఇంటిపై సిబిఐ అధికారులు దాడి వైసిపికి అందివచ్చిన అవకాశంగా మిగిలింది. టిడిపి నేతలు అలెర్ట్ అయ్యేలోపు వైసిపి నేతలు చేసిన ప్రచార దాడి వారిని ఆత్మ రక్షణలోనికి నెట్టింది. కాని అది కూడా మరుసటి రోజుకు తేలి పోవడంతో నిరాశ మిగిలింది. చంద్రబాబు నాయుడు పియస్ ఇంటిలో రెండు వేల కోట్లు పట్టుబడలేదని తేలి పోవడంతో వైసిపి ఇరుకున పడవలసి వచ్చింది. ఒక దాని వెంబడి మరొకటిగా వైసిపి–టిడిపి నేతలు ఒకరిపై మరొకరు పై చేయి సంపాదించడంలో మునిగి తేలడంతో వుండిపోయారు. ఈ లోపు సెర్బియాలో నిర్భంధంలో వున్న నిమ్మగడ్డ ఎపిసోడ్ చాకచక్యంగా టిడిపి నేతలు తెర మీదకు తెచ్చారు. వైసిపి నేతలు దీనికి జవాబు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో టిడిపి నేతలు నోరు ఎత్తలేని విధంగా కొడితే కుంభ స్థలమే కొట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాస్త్రమే ప్రయోగించారు. అదీ గుట్టుచప్పుడు కాకుండా టిడిపి నేతలు ఆత్మరక్షణలో పడే విధంగా ఆదేశాలు జారీచేశారు. అయిదు సంవత్సరాల తెలుగు దేశం హయాంలో జరిగిన అన్ని కీలక నిర్ణయాలపై విచారణకు సిట్ నియమించుతూ జీవో జారీ చేయబడింది.ఈ చర్యతో వైసిపి నేతలకు వెసులుబాటు లభించింది.

వాస్తవంలో ఇంతకు మునుపెన్నడూ ఏ రాష్ట్రంలో ఈ విధంగా విచారణ జరపకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం మాత్రం వుంది. విశేషం ఏమిటంటే తెలుగు దేశం పాలనలోనే కాదు ఏ పార్టీ ఏ రాష్ట్రంలో పాలన సాగించినా అందులో తప్పులు వెతకడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ మాట కొస్తే మున్ముందు వైసిపి పాలనపై వచ్చే అయిదు ఏళ్ల తర్వాత విచారణ జరిగితే వీళ్లు పట్టుబడక తప్పదు.

ఇప్పుడు సమస్య అదికాదు. తనకు ప్రతిదానికి బంధకంగా తయారౌతున్న టిడిపిని నిలువరించాలంటే ఇంత కన్నా మరో మార్గం ముఖ్యమంత్రికి లేదు. ఒక పక్క రాష్ట్ర ప్రజలు ఆఖండ విజయం చేకూర్చినా తప్పు గాని ఒప్పు గాని తను తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రతి బంధకంగా వున్నవారికి బ్రేక్ వేయాలని ముఖ్యమంత్రి ఈ ఆయుధం ప్రయోగించారని భావించాలి. ప్రస్తుతానికి ఆత్మ రక్షణలో పడిన టిడిపి ఏమేరకు ప్రతి ఘటన ఇస్తుందో వేచీ చూడాలి. గమనార్హమైన అంశమేమంటే టిడిపి సాగిస్తున్న మూడు రాజధానుల వ్యతిరేక పోరాటానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. గాని ముఖ్యమంత్రి టిడిపి పై ప్రయోగించిన ఆయుధంలో ఎవరి మద్దతు టిడిపికి లభించడంలేదు.