ఈ-పాస్ దరఖాస్తు కోసం.. జగన్ !


కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ని చాలా కఠినంగా అమలు చేశారు. అయితే ఈ లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే.  కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, దేశంలో మహమ్మారి కరోనా తీవ్రత ఇంకా ఉన్నప్పటికీ.. కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో లాక్ డౌన్ నుండి సడలింపులు చేస్తూ, పలు రంగాలకు ఆంక్షలతో కూడిన అనుమతులు జారీ చేస్తున్నాయి మన ప్రభుత్వాలు. కాగా ఈ క్రమంలో అత్యవసర వైద్య చికిత్స, కుటుంబంలో మరణం, సామాజిక పనులు, ప్రభుత్వ విధి నిర్వహణ తదితర అత్యవసర పనుల పై ప్రయాణించాలనుకునే వారికి ఈ-పాస్‌లు జారీ చేయనున్నట్టు ఏపీ పోలీస్ శాఖ వెల్లడించిన సంగతి కూడా తెలిసిందే.  కాగా ఇలాంటి అత్యవసరమైన ప్రయాణాల కోసం సంబంధిత ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలి.
 
అలా చేసుకున్నవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు ఈ పాసులు జారీ చేయనున్నట్లు ఏపీ డీజీపీ కార్యాలయం ఒక అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. కాగా ఈ – పాస్‌ల కోసం https:citizen.appolice.gov.in అనే వెబ్‌ సైట్‌ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. బాధితుల వివరాలను ఆమోదించినట్లైతే, దరఖాస్తు చేసుకున్న వారికి వారి మొబైల్, మెయిల్ ఐడీకి వాహన అత్యవసర పాస్‌ను పంపించనున్నారు. మరి ఎప్పుడు ఎప్పుడూ బయటకు వద్దామా అని చూస్తున్న జనానికి ఈ వెబ్ సైట్ మంచి అవకాశంగా మారనుంది.